మొదటిరోజు జరగని సర్టిఫికెట్ల పరిశీలన

రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుండి డీఎస్సీ అభ్యర్థుల జాబితా సకాలంలో రాకపోవడంతో మంగళవారం జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది

Update: 2024-10-01 15:53 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుండి డీఎస్సీ అభ్యర్థుల జాబితా సకాలంలో రాకపోవడంతో మంగళవారం జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. వివిధ కేటగిరీల రిజర్వేషన్లు తదితర వివరాలను రాష్ట్ర అధికారులు గుర్తించడానికి సమయం సరిపోకపోవడంతో జాబితాను ఆయా జిల్లాల అధికారులకు మంగళవారం ఉదయం నాటికి పంపలేదు. సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడంతో అభ్యర్థులు అందరూ వారి వారి జిల్లా కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం హాజరయ్యారు. మొదటి రోజు వేచి ఉండి నిరాశగా వారంతా వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు సెల్ ఫోన్లు, మెయిల్ లకు సమాచారం పంపారు. దీంతో బుధవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన జాబితా బుధ లేదా గురువారం రానుండడంతో వారి సర్టిఫికెట్ల పరిశీలన ఎస్జీటీ అభ్యర్థుల తర్వాత నిర్వహించనున్నారు.


Similar News