నేటి నుంచి సలేశ్వరం జాతర.. ఆదివాసీలే పూజారులు

నల్లమలలోని కొండ కోనల, వాగు సొంపుల మధ్య అలసిన ప్రాణాలకు చల్లని ఆనందాన్ని కలిగించే రెండు కొండల మధ్య వెలసిన "సలేశ్వరం లింగమయ్య" జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Update: 2023-04-05 02:39 GMT

దిశ, అచ్చంపేట: నల్లమలలోని కొండ కోనల, వాగు సొంపుల మధ్య అలసిన ప్రాణాలకు చల్లని ఆనందాన్ని కలిగించే రెండు కొండల మధ్య వెలసిన "సలేశ్వరం లింగమయ్య" జాతర ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది ఒకసారి ఏప్రిల్ మాసంలో జాతర జరుగుతుంది. ఈనెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. సలేశ్వరం జాతర వద్ద ఆదివాసీలే పూజారులుగా కొనసాగుతున్నారు. సలేశ్వరం జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల నుండి లక్షలాదిమంది భక్తులు సలేశ్వరం లింగమయ్యను ప్రతి ఏడాది దర్శించుకుంటారు.

సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం అచ్చంపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, తదితర జిల్లాల నుండి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు నడపరున్నారు. అడవిలో ప్లాస్టిక్ నిషేధిస్తే అటవీశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు, వాహనదారులకు ముందస్తు సూచనలు చేశారు. కాగా, మంగళవారం వందలాది భక్తులు సలేశ్వరం జాతరకు వెళ్లేందుకు రాగా అటవీశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎత్తయిన జలపాతం..

ప్రకృతి సోయగాల మధ్య వెలసిన క్షేత్రం సలేశ్వరం వద్ద నింగి నుంచి నేలకు జలవారుతున్న తీరుగా సుమారు 300 వందల అడుగుల ఎత్తు నుంచి జలపాతం గుండంలోకి నీరు చేరుతుంది. స్వామిని దర్శించుకోవడం ఎంతో సాహసంతో కూడిన పని. అత్యంత ప్రమాదకరంగా కొండ చరియలపై నడుస్తూ లింగమయ్య లోయకు చేరుకోవాలి. సలేశ్వరం జాతర ప్రతి ఏడాది వారం, పది రోజుల పాటు కొనసాగేవి. అయితే రిజర్వ్ టైగర్ అడవుల్లో పెద్దపులుల సంచారానికి ఇబ్బందులు తలెత్తుతాయని కారణంతో కుదించారు. పౌర్ణమికి ఒక రోజు ముందు, ఒక రోజు వెనుక మొత్తం మూడు రోజుల పాటు వేడుకలు జరిగేలా నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు.

మార్గాలు రెండు..

నల్లమల్ల అడవుల్లో వెలిసిన లింగమయ్య , సలేశ్వర ఉత్సవాలకు వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామం మీదుగా కాలి నడకతో పాటు ట్రాక్టర్ల ద్వారా కొండగుట్టల పై నుంచి సలేశ్వరం చేరుకోవచ్చు. మరో దారి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లోని మన్ననూర్ గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి మీదుగా మన్ననూర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరహబాద్ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి పూర్తిగా దట్టమైన అడవుల్లో 30 కి. మీ దూరం రాంపూర్ పెంటకు చేరుకున్న తర్వాత అక్కడనుండి మరో రెండు కిలోమీటర్ల దూరం ఆటోల ద్వారా వెళ్లే ప్రధాన మార్గం వద్దకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో మూడు కి.మి దూరం కాలినడకన కొండలు గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం వద్దకు చేరాలి.

రూ. లక్ష విలువగల పేపర్ బ్యాగులు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ శాఖ తరపున ప్లాస్టిక్ నియంత్రణ కోసం సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు కొబ్బరికాయ, లడ్డూల పంపిణీ చేసేందుకు ఆలయ కమిటీ కి రూ.లక్ష విలువగల పేపర్ బ్యాగులను ఆలయ కమిటీకి ఉచితంగా అందజేశామని జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి తెలిపారు.


Tags:    

Similar News