పాలమూరు పనులు ఐతనేలేవు
వచ్చే జూలై-ఆగస్టు నెలలలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన రిజర్వాయర్లను వరద నీటితో నింపాలి. పనులను వెంటనే చేపట్టాలి..
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: వచ్చే జూలై-ఆగస్టు నెలలలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైన రిజర్వాయర్లను వరద నీటితో నింపాలి. పనులను వెంటనే చేపట్టాలి.. అని గత నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని ఇక్కడే కూర్చి వేసుకొని మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 11న కరివేన రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడం, తదితర కారణాలవల్ల గడువు లోపు కాదు కదా 8 సంవత్సరాలవుతున్నా పనులు పూర్తి కాలేదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టిని అంతా కాలేశ్వరంపై ఉంచి రికార్డు సమయంలో పూర్తి చేశారు. దీనితో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పలు రకాల కారణాలు చూపుతూ మూలన పడేసినంత పని చేశారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి కాకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమకు ఇబ్బందులు తప్పవు అని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ లో మొదటి సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి ఇదే అంశంపై నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర అధికార బృందం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించి ఇప్పటివరకు జరిగిన పనులు, రిజర్వాయర్ల నిర్మాణాలు, మిగతా పనులు పూర్తి చేయడానికి ఎదురవుతున్న సమస్యలు, భూ సేకరణ, నిర్వాసితులకు నష్టపరిహారాల చెల్లింపు లు తదితర వివరాలను సేకరించారు. వాటిని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఆలస్యమైన పనులు పూర్తయి రిజర్వాయర్లకు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ ఇప్పటివరకు ఆ స్థాయిలో పనులు జరగడం లేదు. అక్కడక్కడ జరుగుతున్న అవి నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా వచ్చే జూలై-ఆగస్టు నెలలో మెయిన్ కెనాల్ ద్వారా రిజర్వాయర్లకు నీరు చేరడం సాధ్యం కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రూ.1,874 కోట్ల బకాయిలు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు 1,874 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. బకాయిలకు సంబంధించి వివరాలు బయటకు వస్తే ఇబ్బందులు పడవలసి వస్తుందని అధికారులు, అటు కాంట్రాక్టర్లు వివరాలు బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. బకాయిలు చెల్లిస్తే తప్ప తాము పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని కొంతమంది కాంట్రాక్టర్లు ఇటీవల ప్రాజెక్టుల సందర్శన కోసం వచ్చిన అధికారుల ముందే కుండబద్దలు కొట్టారు. పనులు ప్యాకేజీలవారీగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించినప్పటికిని పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పటికీ పనులు ఆరంభం కాలేదు. ఒకవైపు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులను కేటాయించాము అని చెబుతున్నప్పటికీ కాంట్రాక్టర్లకు మాత్రము చెల్లింపులు జరగడం లేదు.
రిజర్వాయర్ల పనులు పూర్తికాలే..
పాలమూరు-రంగారెడ్డి పనులు 70 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయి అని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నా వాస్తవంగా 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు అని తెలుస్తోంది. పనులకు ఆటంకాలు కలగకుండా తాగునీటి అవసరాల కోసం అని చూపుతూ పనులు పూర్తి చేస్తాం అని అధికార పార్టీ నేతలు చెబుతున్న అది కార్యరూపం దాల్చడం ఇప్పట్లో సాధ్యం కాదు అన్నది నిజం అని పలువురు నిపుణులు, ప్రతిపక్ష నేతలు అంటున్నారు.
సీఎం కుర్చీ వేసుకుని కూర్చుంటేనే పనులు
ముఖ్యమంత్రి కేసీఆర్ కర్వేనా రిజర్వాయర్ శంకుస్థాపన సమయంలో ఇక్కడే ఓ గెస్ట్ హౌస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సహకారంతో కట్టించుకుంటా.. కుర్చీ వేసుకుని కూర్చుని మూడేళ్లలో పనులు చేయిస్తానని చెప్పారు.. అప్పుడు చెప్పిన మాటలు కార్యరూపం దాల్చలేదు కానీ.. ఇటీవల సచివాలయంలో చెప్పిన మాటలు నిజం కావాలంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో గెస్ట్ హౌస్ కట్టించుకోవడమే కాదు.. పనులు పూర్తి చేయించడానికి కుర్చీ వేసుకుని కూర్చోవాలని.. పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్యరూపం దాల్చకుంటే ఎన్నికల్లో ఇబ్బందులే
వచ్చే జూలై-ఆగస్టు నాటికి రిజర్వాయర్ లోకి నీటిని తీసుకురాకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఇబ్బందులు పడవలసి పరిస్థితులు నెలకొంటాయి. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యూహాలు రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు..
నీళ్లు తోడుకు రావడానికి అక్కడ ఏమైనా సముద్రం ఉందా
వచ్చే ఆగస్టు నాటికి రిజర్వాయర్లు నింపడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలను మరోసారి మోసం చేయడమే. ఇప్పటికీ 40శాతంకు మించి పనులు పూర్తి కాలేదు. మోటార్లు బిగించ లేదు. మెయిన్ కెనాల్ పూర్తి కాలేదు. నిర్వాసితులకు నష్టపరిహారాలు చెల్లించలేదు. ఇలాంటప్పుడు నీళ్లు ఇస్తాము అని పదేపదే చెప్పడం ఉమ్మడి జిల్లా ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కేసీఆర్ మాయమాటలను ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు.-హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేత