నిరుద్యోగ మార్చ్ కి తరలిరండి: డీకే అరుణ
ఈ నెల 25వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్ ఉంటుందని, ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు.
దిశ, గద్వాల: ఈ నెల 25వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్ ఉంటుందని, ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. శనివారం గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో నిరుద్యోగ మార్చ్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ బూత్ నుంచి బూత్ స్థాయి నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరుకావాలని అన్నారు.
నిరుద్యోగ మార్చ్ తో సీఎం కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు నిరుద్యోగులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ల కుటుంబమే బాగుపడింది తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చింది లేదన్నారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ల బతుకులు మారుతాయి అనుకున్నారని తీరా నిరుద్యోగులు ఆగమయ్యారని వాపోయారు.
మంత్రి కేటీఆర్ వైఫల్యం వల్ల టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన లక్షలాది మంది అభ్యర్థులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, జిల్లా సహా ఇంచార్జ్ వీరేంద్ర గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం క్రిష్ణ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి నాగేందర్ యాదవ్, కౌన్సిలర్ రజక జయశ్రీ తదితరులు ఉన్నారు.