మాదాసి కురువలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
మాదాసి కురువలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మంత్రి సభ దగ్గర మాదాసి కురువలు ధర్నా చేపట్టారు.
దిశ, గద్వాల క్రైమ్ : మాదాసి కురువలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మంత్రి సభ దగ్గర మాదాసి కురువలు ధర్నా చేపట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యాడ్ ఆవరణలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. సభ దగ్గరకు చేరుకున్న సంఘం నాయకులు కొద్దిసేపు నిరసన తెలిపారు. దీంతో అక్కడ నాయకులు నిరసన వద్దకు చేరుకొని సభ ముగిసిన తర్వాత మంత్రితో మాట్లాడాలని నచ్చజెప్పడంతో విరమించుకున్నారు. అనంతరం మంత్రికి మాదాసి కురువ సంఘం నాయకులు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం సభలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గత పాలకుల వైఫల్యం వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. గతంలో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితిలో ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇక్కడ బీజేపీ నాయకులు చేస్తున్నది ప్రజా గోస యాత్ర కాదని, రాజకీయ గోస యాత్ర అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు తెలంగాణ పాలనపై ఇలాంటి నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సరిత, ఏంపీపీ ప్రతాప్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేశవ్, నాయకులు పాల్గొన్నారు.