ముక్కిపోయిన బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం కొమ్మూరు మండల పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు.
దిశ, గుండుమాల్: నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం కొమ్మూరు మండల పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం వడ్డిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు. స్థానికులు వంట గదిలోకి వెళ్లి పరిశీలించగా ముక్కిపోయిన బియ్యం, చిట్టేలు కట్టిన బియ్యం దర్శనమించాయి. విద్యార్థులు పురుగుల అన్నం వడ్డిస్తున్నారని వంట సిబ్బందిని అడగగా ఇంటి నుంచి తెచ్చుకొని తినండి అని వాళ్ళని బెదిరించారని తెలిపారు.
పాఠశాలలో వండిన అన్నం తిని కొంతమంది విద్యార్థులకు వాంతులు కాగా, మరికొంతమంది విద్యార్థులకు జ్వరం వచ్చిందని తెలిపారు. తినడానికి పనికి రాని బియ్యాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్న, పర్యవేక్షణ చేయాల్సిన సీఆర్పీలు, ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు వీరారం గ్రామం నుంచి పాఠశాలకు వస్తున్నారని, నెల రోజుల నుంచి ఇంటి దగ్గర నుంచి విద్యార్థులు టిఫిన్ బాక్స్ తీసుకుని వస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యాన్ని అందించి మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండేటట్లు చూడాలని కోరారు.