జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్‌లో లుకలుకలు
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న అంతరాలు తొలగించేలా నిర్వహించాల్సిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్య నేతల మధ్య ఆత్మీయతలు దెబ్బతింటున్నాయి.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న అంతరాలు తొలగించేలా నిర్వహించాల్సిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్య నేతల మధ్య ఆత్మీయతలు దెబ్బతింటున్నాయి. ప్రత్యేకించి గత మూడు నాలుగు రోజుల నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న సమ్మేళనాల్లో ఈ వ్యవహారాలు బయట పడుతున్నాయి. ఒకవైపు కార్యక్రమాలలో పాల్గొనడానికి తనకు ఆహ్వానం అందలేదని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చెబుతూ ఉంటే... మరోవైపు ఎమ్మెల్యే ఆహ్వానించినా మా సమస్యలు పరిష్కారం కాలేదంటూ అలంపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు వెళ్లమంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ఇక నుంచి జరిగే కార్యక్రమాలు ఇలాగే కొనసాగితే విభేదాలు పెరిగి పార్టీకి నష్టం వాటిల్లుతుందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విభేదాలు సృష్టిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు..
నాయకులు, కార్యకర్తల మధ్య. ఉన్న అంతరాలను తొలగించి అందరూ కలిసికట్టుగా వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల సారథ్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు నేతల మధ్య మరింత విభేదాలను సృష్టించేలా మారుతున్నాయి. అందరి మధ్య సఖ్యతను కుదిరించేందుకు పార్టీ సీనియర్లు, పలువులు ఎమ్మెల్సీలను ఆయా జిల్లాల ఇన్చార్జిలుగా నియమించారు. కానీ జోగులాంబ గద్వాల జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నేతల మధ్య విభేదాలను సృష్టించేలా సాగుతున్నాయి. కార్యక్రమాలు ఆరంభానికి ముందే మంత్రులు,జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితర ముఖ్య నాయకులతో కలిసి కార్యక్రమాల నిర్వాహణకు సంబంధించి జిల్లాల ఇన్చార్జులు తగిన సలహాలు సూచనలు చేయవలసి ఉంటుంది.
మంత్రులు, ఎమ్మెల్యేల సారథ్యంలో కార్యక్రమాలు జరగాలని, కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాలకు హాజరు కావలసిందిగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్ లను కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించ వలసి ఉంటుంది. కానీ జోగులాంబ గద్వాల జిల్లాలో గత నాలుగు ఐదు రోజుల నుంచి కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో విభిన్న పరిస్థితులు ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి సారథ్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కార్యక్రమాలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య హాజరు కావడం లేదు. తనకు ఆహ్వానం లేకపోవడం వల్లే పార్టీ కార్యక్రమాలకు వెళ్లడం లేదని సమాచారం. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య మధ్య గత కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. పలు సందర్భాలలో పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. వచ్చే ఎన్నికలలో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య ఉన్నారని ప్రచారం జరుగుతుండడం నేతల మధ్య విభేదాలకు దారితీసింది. అలంపూర్ నియోజకవర్గంలో పరిస్థితులు మరోలా ఉన్నాయి.
ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో పాటు, జిల్లా పరిషత్ చైర్మన్, ఆయా మండలాల స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. ఆ కార్యక్రమాలకు ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు డుమ్మా కొడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా ఇన్చార్జి చర్యలు తీసుకోవాలని, సమస్యలు పరిష్కరిస్తేనే తాము కార్యక్రమాలకు హాజరవుతాం అన్నట్లుగా ఆయా మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు కూర్చున్నట్లు సమాచారం.
అయినప్పటికిని ఎమ్మెల్యే కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరవుతుండడంతో ఎమ్మెల్యే అబ్రహం ఉత్సాహంగా అన్ని మండలాలలో కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఆయన నియోజకవర్గాలలో ముఖ్యమైన నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుంది అన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం..
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో పార్టీ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. కార్యక్రమాలలో అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం వారి బాధ్యత. పార్టీకి నష్టం జరగకుండా చర్యలు చేపడతాం.:-రవీందర్ రావు, బీఆర్ ఎస్ ఇంచార్జ్, జోగులాంబ గద్వాల జిల్లా