రాయుడి గిరులు భక్త జన సంద్రం..

పేదల ఇలవేల్పు పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి

Update: 2024-11-09 02:00 GMT

దిశ, చిన్న చింతకుంట: పేదల ఇలవేల్పు పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి గోవిందనామంతో కురుమూర్తి గిరులు మారుమోగాయి. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఊరేగింపు నేత్రానందం గా సాగింది. శుక్రవారం ఉదయం పల్లమర్రిలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చాటకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి భక్తుల సందడితో మేళతాళాల మధ్య చాటను ఊరేగింపుగా నెల్లికొండి మీదగా చిన్నవడ్డెమా న్‌లోని ఉద్దాల మండపం వరకు తీసుకొచ్చారు. అక్కడ ఆచారం ప్రకారం స్థానిక దళిత లతోపాటు కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి, దేవస్థాన చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పూజలు చేశారు.

అక్కడే భక్తుల దర్శనం కోసం ఉద్దాలను కొంత సమయం ఉంచి అక్కడి నుంచి వాగులో నుంచి తరలిస్తుండగా భక్తులు చాట కింద దూరి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై తిర్మలాపూర్‌ గ్రామం మీదుగా కురుమూర్తి స్వామి ఆలయ సమీపంలోని ఉద్దాల మండపం వద్దకు సాయంత్రం చేరుకున్నాయి. అక్కడి నుంచి స్వామివారి ఆలయ ముఖద్వారం వద్దకు ట్రాక్టర్‌పై ఊరేగింపులో మంగళవాయిధ్యాలు, భక్తుల భజనలు, సిగసత్తుల పూనకాలతో అంగరంగవైభవంగా స్వామి వారి ఉద్దాల ఊరేగింపు తీసుకొచ్చి ఉద్దాల మైదానంలో ప్రదక్షిణలు చేశారు. బాణాసంచా భక్తులను ఆకట్టుకుంది. అనంతరం ఆలయం వద్దకు చేరుకోగానే ప్రత్యేక పూజలు అనంతరం ఉద్దాల మండపం వద్దకు తీసుకెళ్తారు భక్తుల సందర్శనార్థం ఉంచుతారు.

పేదల తిరుపతికి లక్షలాదిగా భక్తులు..

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉద్దాలు ఊరేగింపునకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దాదాపు మూడు లక్షలకు పైగానే తరలి వచ్చినట్లు పరిశీలకులు తెలిపారు. వివిధ సందర్భాల్లో తొక్కిసలాట జరిగే ప్రమాదం వచ్చింది. ఆ సమయంలో పోలీసులు నిరోధించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరారు.ఏర్పాటు చేసిన క్యూలైన్‌ నుంచి గుట్టపై ఉన్న కాంచనగుహ వరకు స్వామివారి దర్శనం కోసం భారీగా క్యూలైన్‌ కట్టారు.

భక్తిశ్రద్ధలతో నైవేద్యం తయారీ..

స్వామివారికి నైవేద్యాలను సిద్ధం చేసుకునేందుకు ముందుగా భక్తులు గుట్ట కింద ఉన్న కోనేరులో పుణ్య స్థానాలు చేస్తారు. అనంతరం అక్కడే కొత్త కుండ కొనుగోలు చేసి అందులో అన్నం వండుతారు. ఆ తర్వాత పచ్చి పులుసు తయారు చేస్తారు. అక్కడే ఉన్న దాసులతో కుండకు బొట్లు పెట్టిస్తారు. గోవిందా గోవిందా కురుమూర్తి వాస గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తారు ఆ తర్వాత భక్తులు దేవుని వైపు తిరిగి కురుమూర్తి వాస గోవిందా కరుణించవయ్యా అని స్వామివారిని తలుచుకొని తమ కోరికలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పచ్చి పులుసు కలిపి అక్కడే పరిశుభ్రమైన స్థలంలో విస్తరి వడ్డించి స్వామికి నైవేద్యం సమర్పిస్తారు అనంతరం దీపాలు వెలిగించి టెంకాయ కొడతారు కొండ ఆ తర్వాత కొండపైకి వెళ్లి కాంచన గుహలో స్వామిని దర్శించుకుని పూజలు చేస్తారు.

ఇసుకేస్తే రాలని జనం..

పాలమూరు తో పాటు వివిధ జిల్లాలకు చెందిన ఎన్నో వేల కుటుంబాలకు కురుమూర్తి స్వామి ఇంటి దేవుడు కావడంతో బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల రోజు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అందుకే భక్తులు ఎవరి స్థాయిని బట్టి వారు బైక్‌లు, ఆటోలు, కార్లు, జీపులు, ఎద్దుల బండ్లు, బస్సులు, గూడ్స్‌ వాహనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరికి అందుబాటులో ఉన్న వాహనాలతో నలుమూలల నుంచి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో భక్తులు కురుమూర్తి స్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో స్వామి వారి ఆలయ పరిసరాలు భక్తులు, వాహనాలతో నిండిపోయింది.

నిరంతరం పర్యవేక్షణ..

బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిరంతరం పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్దాల ఉత్సవంలో ముగ్గురు, డిఎస్పీలు, 12 మంది సీఐలు,42మంది ఎస్ఐలు 100 మంది ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్, 239 మంది పోలీసులు 79 మంది మహిళా పోలీసులు 121 మంది హోంగార్డ్స్ జాతరలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జాతరలో ప్రత్యేకించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి భక్తులను పలకరిస్తూ సందడి చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లయ్య, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, జగదభి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరి రాము, మాజీ ఎంపీటీసీ స్వప్న శివకుమార్, సురేందర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News