భయమేస్తోంది భద్రతను పెంచండి
శనివారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు సంఘటనపై తనకు భయమేస్తోందని,తమకు భద్రత పెంచాలని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: శనివారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోకి ఆగంతకుడి చొరబాటు సంఘటనపై తనకు భయమేస్తోందని,తమకు భద్రత పెంచాలని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. తాను సీఎం ఉండే ఏరియాలో ఉన్నానని,అయినా ఆగంతకుడు తన ఇంట్లోకి ప్రవేశించటం పట్ల తన భద్రతపై అనుమానాలను ఆమె వ్యక్తంచేశారు. తాను రెండు రోజులుగా మహబూబ్ నగర్ లోనే ఉన్నానని,గత రాత్రి 3 గంటల ప్రాంతంలో సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి,వంటగది కిటికీలోంచి దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి గంటన్నర పాటు కలియ తిరుగుతూ సామాన్లనంతటిని చిందరవందరగా చేస్తూ,ఏం రెక్కీ నిర్వహించాడోనని ఆమె పలుఅనుమానాలను వ్యక్తం చేసింది. ఇంతా జరిగినా తన ఇంట్లో నుండి చిన్న వస్తువు కూడా తీసుకెళ్ళలేదని,తాను ఇంట్లో ఉండి ఉంటే ఏం జరిగేదోనని తన పరిస్థితిని తలచుకొని ఆమె భయాన్ని వ్యక్తం చేసింది.ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని,వెంటనే సమగ్ర విచారణ జరిపి ఆ ఆగంతకుడిని పట్టుకోవాలని,ఇట్టి విషయంలో సీఎం సీరియస్ గా స్పందించాలని,తన ఇంటికి భద్రత పెంచాలని ఆమె పునరుద్ఘాటించారు.