బొట్టు పెట్టి చెబుతున్నాం.. బడి వేడుకలకు రండి..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కృషిలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.
దిశ, కొల్లాపూర్ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కృషిలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కొన్నింటిని పైలెట్ ప్రాజెక్టు గా తీసుకొని రూ. లక్షల్లో వెచ్చించి అన్ని వసతులతో సుందరంగా పునర్నిర్మించారు. ఇందులో భాగంగానే కొల్లాపూర్ మండలం సింగోటంలోని ప్రభుత్వ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల భవన సముదాయాలను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో మొత్తం రూ. 70.80 లక్షల వ్యయంతో అన్ని హంగులతోనూ తీర్చిదిద్దారు. చిన్న పిల్లలు సైతం బడి వైపు ఆకర్షించేలా ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అయితే ఈ పాఠశాలల భవన సముదాయాలను ఈ నెల 6వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయటానికి అన్ని హంగులతో రూపుదిద్దారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ లను గ్రామ పెద్దలు ఆహ్వానించారు. పాఠశాలల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసే ముఖాముఖి కార్యక్రమానికి వచ్చి ఇంకా ఏమైనా సమస్యలుంటే తమ అభిప్రాయాలను మంత్రి, జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించుకోవడానికి రావలసిందిగా పాఠశాలల ఉపాధ్యాయుల బృందం తల్లిదండ్రులకు బొట్టు పెడుతూ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.
గ్రామంలో మాజీ సర్పంచ్ ఇమ్మిడిశెట్టి వెంకటస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి గ్రామంలో స్పందన లభిస్తుంది. నేడు సమాజంలో విద్యావ్యాపారంగా మారడంతో పేదింటి బిడ్డల చదువులకు తాము కష్టపడి సంపాదించిన సొమ్మంతా ప్రైవేటు పాఠశాలల్లో చదివే తమ పిల్లలకు ఫీజుల రూపంలో వ్యయం చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేట్, విద్యా, భారం కాకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అన్ని వసతులతో కల్పిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకునేందు కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు సింగోటంలో తల్లిదండ్రుల ముఖాముఖి కార్యక్రమంలో దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నెల 6వ తేదీ రోజు ప్రభుత్య హై స్కూల్, మండల ప్రాథమిక పాఠశాలలను మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం రూ. కోటి 43 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం, హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్య పాఠశాలలను తీర్చిదిద్దితున్నామని గ్రామ మాజీ సర్పంచ్ వెంకటస్వామి తెలిపారు.