నూతన భరోసా సెంటర్ భవనం ప్రారంభం

భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.నూతన భరోసా సెంటర్ భవనం ప్రారంభం

Update: 2024-11-12 10:15 GMT

దిశ, గద్వాల  : భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ కల్పించే విధంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలు, బాలికలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఫాక్సో కేసులను ఈ సెంటర్ ద్వారా బాధితులకు న్యాయం, ఆర్థిక సహకారం అందించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు ప్రతి ఒక్కరు భరోసా సెంటర్ ద్వారా లభించే సేవలు సదుపాయాలతో పాటు.. కేసు నమోదు ఇలాంటి విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ నిర్మాణానికి మెగా ఇన్ఫ్రా స్ట్రక్చర్ దాదాపు 2.10 కోట్ల రూపాయలు సొంత డబ్బులు వెచ్చించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. అంతకుముందు జిల్లా ఎస్పీ, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తోట శ్రీనివాసరావు మాట్లాడుతూ... భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు పిల్లలకు న్యాయం జరిగేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. గద్వాలలో 2002లో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భరోసా కేంద్రంతో పాటు షీ టీమ్స్ పనిచేస్తుందని బాధిత మహిళలు బాలలకు ఒకే గొడుగు క్రింద పనిచేస్తాయని తెలిపారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎస్పీ తెలిపారు. ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో న్యాయ సలహాలు వైద్యం సైకాలజీ తదితర వాటిపై పనిచేస్తాయని అన్నారు. నిరాదరణకు గురైన మహిళలు బాలలకు భరోసా కల్పించేందుకు గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫోక్సో కేసుల అనంతరం వారి విచారణ కోర్టులో న్యాయం జరిగే వరకు వారి బాగోగులు చూస్తారని తెలిపారు. భరోసా కేంద్రంతో పాటు ఐసిడిఎస్ సఖి ఎన్జీవో వారికి బాధ్యత ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 195 కేసులు నమోదు కాగా.. 158 ఫోక్సో కేసులు ఉన్నాయని అన్నింటికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 197మంది బాధిత మహిళలకు 35లక్షలు రూపాయలు ఇప్పించినట్లు తెలిపారు. బాధిత మహిళలకు పిల్లలకు 24/7 సేవలు అందిస్తుందన్నారు. మెగా కంపెని అసోసియేట్ జనరల్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ..తెలంగాణలో ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా నాలుగు జిల్లాలలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కొక్కటి రూ.2.10 కోట్లతో నిర్మించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, పోలీసుశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Similar News