బల్మూర్ గ్రామపంచాయతీలో అవినీతి బాగోతం ?

నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు గ్రామపంచాయతీలో ఎలాంటి గ్రామ తీర్మానాలు, గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా పంచాయతీ కార్యదర్శి, అప్పుడున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో దాదాపు మూడున్నర కోట్లకు పైగా అవినీతి జరిగిందని గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) దృష్టికి తీసుకెళ్లారు.

Update: 2024-10-24 04:37 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు గ్రామపంచాయతీలో ఎలాంటి గ్రామ తీర్మానాలు, గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా పంచాయతీ కార్యదర్శి, అప్పుడున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో దాదాపు మూడున్నర కోట్లకు పైగా అవినీతి జరిగిందని గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మంచి కట్ల అనిల్ కుమార్ పర్యవేక్షణలో నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జి మిద్దె శివప్రసాద్ అధ్యక్షతన బల్మూర్ గ్రామపంచాయతీలో రికార్డులు పరిశీలించారు. సీసీఆర్ బృందం మూడు నెలల క్రితం నమోదైన రికార్డులను తనిఖీలు చేయగా విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయన్నారు. ఈ నివేదికను అక్టోబర్ 21న కలెక్టర్ కు గ్రీవెన్స్ డే అందజేసినట్లు జిల్లా అధ్యక్షుడు తెలిపారు.

అవినీతి రూ. 3.55 కోట్లు ?

బల్మూర్ గ్రామ పంచాయితీలో 2013 నుండి 2024 వరకు కార్యదర్శి ఇచ్చిన బ్యాంకు స్టేట్మెంట్ ప్రకారం అక్షరాల మూడు కోట్ల యాబై ఐదు లక్షల, పద్దెనిమి వేల ఐదు వందల నలభై మూడు రూపాయలు నిధులు ఖర్చు చేశారు. ఈ నిధుల గురించి గ్రామపంచాయతీలో, గ్రామ సమావేశాలు, గ్రామ సభలలో గానీ గ్రామ ఆమోదిత బడ్జెట్ నివేదిక చూపించలేదన్నారు. అలాగే గ్రామ తీర్మానాలు లేకుండా గ్రామ ఖర్చులకు సంబంధించిన ఓచర్లు, బిల్స్, రసీదులు, పనుల బిల్లులు సంబంధిత ఫైల్స్, పరిపాలన అనుమతులు, సాంకేతిక అనుమతులు, ఎస్టిమేట్స్, అగ్రిమెంట్లు, టెండర్ల ప్రక్రియ ఎస్టిమేషన్లు, వాటికీ సంబంధించిన ఒప్పంద పత్రాలు, సాంకేతిక అనుమతుల వివరాలు, ఎలాంటి బిల్లుల వివరాలు లేకుండానే డ్రా చేసినట్లు వారు చేపట్టిన విచారణలో తేటతెల్లమైందన్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపం..

గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములు, స్థిర, చర ఆస్తులను గ్రామ పంచాయతీ పేరుమీద రిజిస్టర్ చేయించుట, రికార్డులను నిర్వహించుట పంచాయితీ కార్యదర్శి బాధ్యత ఉంటుంది. గ్రామ పంచాయతీ ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ రూల్స్ 2011 ప్రకారం గ్రామ పంచాయతీలకు సంబంధించిన భూములు, ఆస్తుల రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదని గుర్తించారు. గ్రామ కార్యదర్శి, పంచాయితీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, విస్తరణ అధికారులు (పి ఆర్ & ఆర్ డి) ప్రతి గ్రామపంచాయతీని కనీసం మూడు మాసాములకు ఒక్కసారి తనిఖీ చేయాల్సి ఉంటుంది.

నిధులు రికవరీ..

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం 2018, చట్టం వ్యతిరేకంగా బల్మూర్ గ్రామ కార్యదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అన్ని అంశాల పై నిధులని విరుద్ధంగా ఖర్చు చేశారు. అది గుర్తించి జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా పంచాయతీరాజ్ డీపీఓకి నివేదిక ఇచ్చి బల్మూర్ గ్రామపంచాయతీ కి సంబంధించిన చెక్ పవర్ ఉన్న సర్పంచి, ఉప సర్పంచ్ లపైన సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారుల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ జీపీకి సంబంధించిన నిధులు దుర్యోనియోగం చేసిన వారిని రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం తిరిగి ఆ నిధులన్నీ బల్మూర్ గ్రామపంచాయతీకి జమ చేయించాలని కలెక్టర్కు నివేదించిన నివేదికలో పొందుపరచామన్నారు. ఈ విచారణ కార్యక్రమంలో సీసీఆర్ బృందం పాల్గొన్నారు.


Similar News