నిఘా నేత్రానికి అనారోగ్యం..
గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా..అప్పటి ఎస్సై రామ్మూర్తి దాతల సహకారంతో 10 కెమెరాలను ఏర్పాటు చేశారు.
దిశ,రాజోలి : గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేను సైతం అనే కార్యక్రమంలో భాగంగా..అప్పటి ఎస్సై రామ్మూర్తి దాతల సహకారంతో 10 కెమెరాలను ఏర్పాటు చేశారు. 16000 పైగా జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీ రాజోలిలో గత కొంత కాలం నుండి దొంగతనాలు, చోరీలతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి.. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇప్పుడు నిద్దుర వ్యవస్థలోకి జారుకున్నాయని,ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతున్నాయని ఇసుక దందా చేసే వాళ్ళు కెమెరాలని ఉద్దేశపూర్వకంగానే పనిచేయకుండా చేశారని స్థానికులు ఆరోపించారు. అలాగే వీటికి కోతులు నిల్వనివ్వట్లేదని బయటికి అబద్ధపు ప్రచారాన్ని చేశారు. దీంతో అధికారుల ప్రమేయం ఉందేమో అన్న అనుమానాలు గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా టూ వీలర్ లు దొంగతనాలు, అక్రమ ఇసుక రవాణా జోరుగా జరుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. గతంలో పలు కేసుల్లో ఈ సీసీ కెమెరాల ద్వారా పురోగతిని సాధించారని, నాలుగు నెలల క్రితం గ్రామస్తుల నుంచి సీసీ కెమెరాలు మరమ్మత్తులకు విరాళాలు సేకరించి ఇంతవరకు మరమ్మత్తులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు, చోరీలు జరగకుండా ఈ సీసీ కెమెరాలు తోడ్పాటు చేస్తాయని వెంటనే ఈ సీసీ కెమెరాలను మరమ్మతులు చేయించే దిశగా అధికారులు అడుగులు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
దీనిపై రాజోలి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి వివరణ కోరగా..
మరమ్మతుల కొరకు దాదాపు లక్ష రూపాయలు పైగానే అవుతుందని, ఇప్పటివరకు దాదాపు 50 నుంచి 60 వేల దాకా విరాళాలు అందాయన్నారు. కెమెరాల టెక్నీషియన్ అనారోగ్యాలు సమస్యలతో బాధపడుతూ.. ఉండడంతో కొంత ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. ఈ కెమెరాలను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేశారు.