రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి రిజర్వాయర్లతో సాగునీళ్లు వదులుతామని ఓట్లు దండుకుని గద్దెనెక్కి రైతుల కడుపు కొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, అలంపూర్: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి రిజర్వాయర్లతో సాగునీళ్లు వదులుతామని ఓట్లు దండుకుని గద్దెనెక్కి రైతుల కడుపు కొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిళ్ల సాగు నీళ్లు రాకపోతే సుమారు 100 కోట్లకు పైగా రైతులు నష్టపోయి అలంపూర్ ప్రాంతం నాశనం అయ్యే పరిస్థితి నెలకొందని.. సాగునీరు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల దగ్గర రైతు సంఘాలు, ఆయా గ్రామాల రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలతో అక్కడికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడారు... మిర్చి, మొక్కజొన్న పంటలు చివరి దశలో ఉన్నాయని, సాగునీరు అందకపోతే 1500 ఎకరాలు పంట వరకు వాడి పోయే పరిస్థితి నెలకొందని, ఇక్కడున్న పాలకులకు ఇవేవీ కండ్లకు కానా రావడం లేదా అని ప్రశ్నించారు. సాగునీరు వదలకుండా కుంటి సాకులు చెప్పి రాయలసీమ ప్రాంత ప్రజలు నీళ్లను తరలించుకుని వెళ్తున్నారని చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పి తుమ్మిల్లా నీళ్లు వదిలితే అలంపూర్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పిన బిఆర్ఎస్ పాలకులు ఎక్కడున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలంపూర్‌లో ఉన్న పాలకులు మాత్రం వారి రాజకీయ భవిష్యత్తు కొరకు గ్రూపులు చేసుకోవడం, కలెక్షన్లు, కమిషన్లకు కక్కుర్తి పడడం తప్ప రైతుల కోసం అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడటం లేదని ఎద్దేవా చేశారు. సాగునీరు వదిలే వరకు తుమ్మిళ్ల కట్టపైనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. రైతుల పక్షాన వెన్నంటి ఉండి పోరాటం చేస్తానని, అది ఎంతవరకు అయినా సరే వెనక్కు తగ్గేది లేదని సంపత్ కుమార్ హెచ్చరించారు. రైతులు కూడా భారీ సంఖ్యలో తుమ్మిళ్లకు చేరుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు