ఆపదలో ఉన్నవారికి సహకరించాలి : మంత్రి జూపల్లి
జిల్లాలోని ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి శ్రీ
దిశ,అచ్చంపేట : జిల్లాలోని ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ గా వేముల నరసింహారావు, సభ్యులుగా స్వరూప రెడ్డి, వేణుగోపాలరావు కృష్ణయ్య ప్రదీప్ ప్రసాద్ గణేష్ గౌడ్ లను పాటు ఆరు మంది పాలకమండలి సభ్యులను ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. లక్ష్మీ నరసింహ స్వామి ధనవంతుడైన ప్పటికీ ఉడుత భక్తిగా తమ నిధుల నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రూ. 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.
ప్రధానంగా ఈ ఆలయానికి 450 వందల ఎకరాలకు పైగా ఆలయ భూములు చాలా విచ్ఛిన్నమై ఉన్నాయన్న విషయం నా దృష్టికి వచ్చిందని.. నూతన కమిటీ తరఫున స్థానిక శాసనసభ్యులు సహకారంతో ఆలయ భూములను పరిరక్షించి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని అందుకున్న వంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఏ మతం దేవుడైన మానవసేవే మాధవ సేవ అని ఆ దృక్పథాన్ని అందరూ కలిగి ఉండాలని, మానవసేవ పోయి మాధవసేవ అధికమైందని కావున కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని తమ వంతు సహకారం అందించినప్పుడే మానవ సేవకు సార్ధకత ఉంటుందన్నారు. మనుషులలో ఆలోచన విధానం పూర్తిగా విధ్వంసం కాబట్టే మన సంస్కృతి సంప్రదాయాలు ధ్వంసం అవుతున్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరం సంసిద్ధులం కావాల్సి ఉంటుందని ఏ పని చేసినా.. మాట్లాడిన మనకు మనం ప్రశ్నించుకుంటే ఇతరులకు నష్టం జరగదని కావున ప్రతి ఒక్కరూ పాజిటివ్ కోణంతో ఆలోచన చేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
ధర్మం చేసే తత్వం మరింత పెంచుకోవాలి...
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఈ దేశంలో భక్తి బాగానే పెరిగింది కానీ ధర్మం అనేది పెరగలేదని, తోచిన ధర్మం చేసినప్పుడే ఇతరులకు మేలు జరుగుతుందన్నారు. ఈ ఆలయానికి పూర్వ చరిత్ర ఉందని, ఆలయ భూముల కొంత అన్యాక్రాంతం అయినాయని వాటిని రక్షించే బాధ్యత చైర్మన్ కు ఉందని, అందుకు పూర్తి సహకారం నా వంతు అందజేస్తానన్నారు. గతంలో ఇక్కడ జాతర సుమారు నెల రోజుల పాటు జరిగేదని నేడు అది పరిమితమైందని పూర్వ వైభవం తీసుకొచ్చేలా చైర్మన్ పాలకమండలి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ఆర్డీవో మాధవి, డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, మద్దిమడుగు ఆలయ చైర్మన్ రాములు, ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.