సారూ..ఈ సమస్యలు తీర్చేది ఎవరు...?

అయిజ మున్సిపాలిటీగా ఏర్పాటై 13 ఏళ్లు గడుస్తున్నా నేటికీ అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి.

Update: 2025-01-09 17:01 GMT

దిశ, అయిజ : అయిజ మున్సిపాలిటీగా ఏర్పాటై 13 ఏళ్లు గడుస్తున్నా నేటికీ అనేక సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. పట్టణ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతుండగా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేక నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు.ముఖ్యంగా పట్టణ పురవీధుల్లో కుంటుపడ్డ అభివృద్ధితో నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రధాన వీధులు,చౌరస్తాలు,రహదారులపై చూపుతున్న శ్రద్ధ పలు వీధిలపై కానరావడం లేదు. దశాబ్దాల కాలంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మున్సిపాలిటీలో 20 వార్డుల పరిధిలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని,హామీ ఇచ్చి అమలు చేయని,మంజూరైనా కార్యరూపం దాల్చని పనులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ పట్టాలెక్కించాల్సిన బాధ్యత ఎవరిది...? అధికారులుగా లేక ప్రజా ప్రతినిధులదా లేకపోతే ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికైన కే విజయుడు, మరి లేదంటే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిపై ఉందా లేకపోతే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఉందా...? అంటూ ప్రజల్లో అంతు చిక్కని ప్రశ్నగా మారిన అయిజ పుర సమస్యలు...?

ఏది ఏమైనప్పటికీ నూతన ప్రభుత్వం ఈ పట్టణ సమస్యలు పరిష్కరించాలని, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిధులు వెచ్చించాల్సి ఉంది.అభివృద్ధికి పాటుపడి చేసేవారికి అండగా నిలవాలని,పట్టణ అభివృద్ధి చెందాలని ప్రజల విన్నపం. ఈ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సి ఉండగా..ఇప్పటివరకు అచరణకు నోచుకోలేదని స్థానికులు వాపోతున్నారు. చేపల, కూరగాయల,మార్కెట్‌ కోసం అనేక ఏళ్లుగా ఎదురుచూస్తు ఉండడంతో..నిర్మాణం పూర్తి అయినప్పటికీ ఇంకా వాడుకలోకి రాలేదని, నేటికీ వ్యాపారులు రోడ్ల పైన కురగాయాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డును 10 నుండి 16 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఏర్పాటు చేసినా.. అందులో తగిన సౌకర్యాలు లేవని..పట్టణ జనాభా సుమారు 33 వేల 883 చేరుకుందన్నారు.ఇక్కడి ప్రజలకు సరైన కనీస వసతులు కూడా కరువయ్యాయని వాపోతున్నారు. పట్టణ పరిధిలో వీధులన్నీ ఇరుకుగా మారి పట్టణీకరణ వేగంగా జరుగడంలేదన్నారు. ఎక్కడ చూసినా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు తెలిపారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంది. వీధులను మరింత విస్తరించి అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా కర్నూల్ టు రాయచూర్ జాతీయ రహదారి బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉందని,నేతలు అనేకమార్లు హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరుచాల్సిన అవసరం ఉంది. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది...ఓట్ల కోసమే తప్పా ప్రజల సమస్యలు పట్టవు అంటూ పలుమార్లు ప్రజలు విన్నపించుకుంటున్న సమస్యల పరిష్కారం జరగడం లేదన్నారు. ఎప్పుడు పూర్తవుతాయో వేచి చూడాలని ప్రజల అభిప్రాయపడుతున్నారు.


Similar News