ఎర్రవల్లి కొత్త మండల ఏర్పాటుకు గెజిట్ విడుదల..

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2023-04-18 12:54 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండల ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు, అవకాశాలు ఉన్నప్పటికినీ కొత్త మండలాల ఏర్పాటు సమయంలో ఎర్రవల్లిని మండలంగా ప్రకటించలేదు. అధికారులు ఎర్రవల్లిని ఇటిక్యాల మండలంలో చేర్చారు. అప్పటి నుంచి ఎర్రవల్లితో పాటు, సమీపంలోని పలు గ్రామా పంచాయతీల ప్రజలు తమకు అనుకూలంగా ఉండేందుకు వీలుగా ఎర్రవల్లిని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

జోగులంబ గద్వాల జిల్లా కేంద్రానికి పాదయాత్రలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయాన్ని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు. ఈ మేరకు ఎర్రవల్లిని మండలంగా ప్రకటించేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

13 గ్రామపంచాయతీలతో కొత్త మండలం..

ఎర్రవల్లి మండలాన్ని మొత్తం 13 గ్రామ పంచాయతీలతో కలిసి ఏర్పాటు చేయనున్నారు. ఈ మండలంలో ఎర్రవల్లి, తిమ్మాపూర్, బీచుపల్లి, షేక్ పల్లి, ససానోల్, బి.వీరాపురం, రాజశ్రీ గార్లపాడు, ధర్మవరం, పుట్టం దొడ్డి, వేముల, కోదండపురం, జినకల పల్లి, కొండేరు గ్రామాలతో కలిపి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి 15 రోజుల్లో అభ్యంతరాలను స్వీకరించి నివేదికను పంపవలసిందిగా జిల్లా కలెక్టర్ ను సంబంధిత రాష్ట్ర అధికారులు కోరారు. ఎర్రవల్లి మండలం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అలంపూర్ నియోజకవర్గంలో మండలాల సంఖ్య ఎనిమిదికి పెరగనుండగా జోగులంబ గద్వాల జిల్లాలో 12 ఉన్న మండలాల సంఖ్య 13 కు పెరగనుంది. మండల ఏర్పాటుకు గెజిట్ విడుదల కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News