పోరాటయోధుడు పండగ సాయన్న : నీలం మధు
నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు.
దిశ, కొల్లాపూర్ (పాన్ గల్): నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్ గల్ మండలం రాయిని పల్లి గ్రామంలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన పండగ సాయన్న విగ్రహాన్ని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి నీలం మధు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా గ్రామంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి, మహిళలు మంగళ హారతులతో వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పగిడాల శ్రీనివాస్, పండుగ సాయన్న జీవిత చరిత్ర పుస్తకం రచయిత, సీనియర్ న్యాయవాది బెక్కెం జనార్దన్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని, భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత వల్లే సాయన్నకు పండగ సాయన్న పేరు వచ్చిందన్నారు. ఈ మహానీయుడు బందూక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదిరించి ఎదురొడ్డి నిలిచి బహుజనులకు అండగా నిలిచాడని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని నీలం మధు పిలుపునిచ్చారు. పండగ సాయన్న సేవలను భావితరాలకు ఆదర్శంగా ఉండాలన్న సంకల్పంతో పండగ సాయన్న విగ్రహలను ఊరూరా నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు. తెనుగోలా సాయన్న ను తెలంగాణ సాయన్నగా తీర్చిదిద్దుతామని ఆయన శపథం చేశారు.ఈ సందర్భంగా పలువురు పాలమూరు యూనివర్సిటీ కి పండగ సాయన్న పేరు పెట్టేలా చూడాలని ఆయన దృష్టికి తీసుకుని రాగా అందుకు సానుకూలంగా స్పందించిన నీలం మధు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి అయ్యే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
రాబిన్‌హుడ్ లాగా పండుగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పంచి పెట్టి ఆకలి తీర్చిన బడుగుల ఆశాజ్యోతి పండుగ సాయన్న అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి, తన సొంత సైన్యాన్ని స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడని,సాయన్న తెలంగాణ ప్రజా వీరుడని వారు అన్నారు. పాలమూరు జిల్లాలో పుట్టిన పండుగ సాయన్న అందరికి ఆదర్శంగా నిలిచారని, నిజం అధికారులపై తిరిగుబాటు చేసి పేద ప్రజల కోసం పోరాటం చేసిన మహోన్నతమైన గొప్ప వ్యక్తి పండుగ సాయన్న అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. కానీ ఆధిపత్య శక్తులైన దేశముక్ లు, కరణంపటేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారని ఎమ్మెల్యే శ్రీహరి ఆరోపించారు. ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడని, ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపైన, గోదాలను పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టిన పండుగ సాయన్న గొప్ప తనం,ధైర్యాన్ని గూర్చి కొనియాడారు.ఈ కార్యక్రమంలో పండుగ సాయన్న జీవిత చరిత్ర పుస్తకం రచయిత, సీనియర్ న్యాయవాది బెకెం జనార్ధన్ మాట్లాడుతూ పండుగ సాయన్న జీవిత చరిత్రపై నవల రాయటానికి తనకు రెండు సంవత్సరాల సమయం పట్టిందని ఆనాటి పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందన్నారు. బహుజన వీరుడు సాయన్న జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పగిడాల శ్రీనివాసులు మాట్లాడుతూ బహుజనులకు దిక్సూచిగా నీలం మధు పనిచేయాలని కోరారు. గతంలో బహుజనుల కోసం కాసాని జ్ఞానేశ్వర్ పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు, సినీ హీరో జైహింద్ గౌడ్, మమతా గౌడ్ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు డా,పగిడాల శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది పండుగ సాయన్న జీవిత చరిత్ర పుస్తకం రచయిత , సీనియర్ న్యాయవాది బెక్కం జనార్ధన్, పండగ సాయన్న వారసులు యాదయ్య,నర్సింలు, సభాధ్యక్షులు శివ ప్రసాద్, దర్గేష్,నాయకులు మమత గౌడ్, పెబ్బేటి మల్లికార్జున్, వెంకటస్వామి,వాకిటి ఆంజనేయులు, చెన్న రాములు, పుట్ట బలరాజు, మెట్టుకాడి శ్రీనివాస్,కృష్ణ, పండగ సాయన్న విగ్రహ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్గేష్,నాయకులు మమత గౌడ్, ప్రొఫెసర్ పెబ్బేటి మల్లికార్జున్, వెంకటస్వామి,వాకిటి ఆంజనేయులు, చెన్న రాములు, పుట్ట బలరాజు, మెట్టుకాడి శ్రీనివాస్,కృష్ణ, పండగ సాయన్న విగ్రహ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.