దిశ, అమరచింత: గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని వనపర్తి జిల్లా డీఎస్‌పీ కేఎం కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని చంద్రఘడ్ గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాల వల్ల ఎదురయ్యే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్‌పీ మాట్లాడుతూ.. గంజాయి, గుట్కా లాంటి వ్యసనాల వల్ల యుక్త వయసులోనే యువత మరణాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ గ్రామంలో కొంత మంది వ్యక్తులు గతంలో గంజాయికి అలవాటు పడి కొన్ని మొక్కలు నాటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆదర్శ గ్రామమైన చంద్రఘడ్ గంజాయి రహిత గ్రామంగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వనపర్తిని గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు తమ పోలీస్ శాఖ మొట్ట మొదటి అవగాహన కార్యక్రమం ఇక్కడే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీ.ఐ బాల్ రాజ్, సివిల్ సీ.ఐ. కె.ఎస్ రత్నం, ఎస్.ఐ పుట్ట మహేష్, డాక్టర్ అక్షయ్ కుమార్, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, జడ్పీటీసీ మార్క సరోజ, వెంకటయ్య, పంచాయతీ సెక్రెటరీ, రాజీక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.