Collector: మాతృ మరణాలకు అవకాశం ఇవ్వొద్దు

జిల్లాలో మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు వైద్య పరంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యాధికారులకు సూచించారు.

Update: 2024-11-05 13:43 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: జిల్లాలో మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు వైద్య పరంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మాతృ మరణాల సమీక్ష సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎంసి చెకప్ సమయంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు గమనిస్తారా ?లేదా? అని ఏఎన్ఎం లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణీకి వైద్య సలహాలలో ఏ ఏ విషయాలు చెబుతారని ఆశా కార్యకర్తలను ప్రశ్నించారు.

గర్భిణీ సమయంలో వచ్చే ప్రమాద సంకేతాల గురించి వైద్యాధికారులు ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు వివరంగా తెలియజేసి వారి ద్వారా గర్భిణీలకు సలహాలు సూచనలు ఇప్పించాలని ఆమె తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ఉండే గైనకాలజిస్టులు ఏఎన్ సీ కార్డులో గర్భిణీ లను పరీక్షించేటప్పుడు పూర్తి వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లాలో మాతృ మరణాలు చోటుచేసుకున్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్ వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో పాటు బాధిత కుటుంబ సభ్యులతో కలెక్టర్ సమీక్ష జరిపారు.


Similar News