దిశ ఎఫెక్ట్ …స్పందించిన జిల్లా అధికారులు

అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని డీడబ్ల్యూఓ జరీనా అన్నారు.

Update: 2024-07-06 15:28 GMT

దిశ, మిడ్జిల్: అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలకు, గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని డీడబ్ల్యూఓ జరీనా అన్నారు. మిడ్జిల్ మండలంలోని 15 అంగన్వాడి కేంద్రాల్లో కుళ్లిపోయిన పురుగులు పడ్డ గుడ్లను సరఫరా చేయడంతో ఈ వార్తను శనివారం దిశ పత్రికలో అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లు అంటూ జిల్లా ప్రధాన సంచిక లో ప్రచురించడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయి ఆదేశాల మేరకు ఆమె శనివారం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేపట్టారు. అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న గుడ్లను పౌష్టికాహారాన్ని పరిశీలించారు. గుడ్డతో పాటు పరిమాణం చిన్నగా ఉన్న గుడ్లను ఆమె గుర్తించారు.

బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు గుడ్ల పంపిణీ చేయడంలో సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్ల నిర్లక్ష్యంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సప్లై చేసే కాంట్రాక్టర్ గత నెల 22వ తేదీ నాడు పంపిణీ చేసిన గుడ్లు అన్ని సెంటర్లలో ఇదేవిధంగా ఉన్నాయని కాంట్రాక్టర్ పై కమిషనర్, జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నామని వారి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ పై చర్యలు ఉంటాయని, అదేవిధంగా గుడ్ల పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మిడ్జిల్ అంగన్వాడీ టీచర్ నర్మదాకు మెమో జారీ చేయగా సూపర్వైజర్ కల్పనను విచారించి శాఖ పరమైన చర్యలకు ఉపక్రమిస్తామని జిల్లా సంక్షేమ అధికారి జరీనా తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాల్సిన సిడిపిఓ నిర్లక్ష్యం వహిస్తే మరోసారి ఇలాంటి ఘటన వెలుగులోకి వస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మారుమూల గ్రామాల్లోనూ తాండాలోనూ పిల్లలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు నాసిరకం గుడ్లను తక్కువ పరిమాణం గల గుడ్లను పంపిణీ చేసినట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట సీడీపీఓ మోహ్రూనిస్స బేగం, సూపర్వైజర్ కల్పన తదితరులు ఉన్నారు.


Similar News