ఒకరికి ఇలా... మరొకరికి అలా..!!
: రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలు, శ్రేణుల మధ్య ఉన్న విభేదాలు తొలగించి.. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసే విధంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని బి.ఆర్.ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు.
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలు, శ్రేణుల మధ్య ఉన్న విభేదాలు తొలగించి.. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసే విధంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని బి.ఆర్.ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం పార్టీ నాయకులు శ్రేణుల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను తొలగించి.. కలిసికట్టుగా పని చేసేందుకు గాను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అధిష్టానం ఇన్చార్జిలను నియమించింది. ఇన్చార్జిలుగా ఎంపికైన వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్సీలే ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలుగా ఎంపికైన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నారు.
ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యేలతో ఇరువురు ఎమ్మెల్సీలకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పరస్పరం పలు సందర్భాల్లో అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. అది స్థానం సైతం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మరి ఆహ్వానం మేరకు కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. నాగర్ కర్నూల్ నుండి మళ్లీ పోటీ చేయనున్న మర్రి జనార్దన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ మధ్య జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి అభ్యర్థిగా ఉంటారు అన్న విషయాన్ని ముందుగానే స్పష్టం చేశారు. కల్వకుర్తి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగుల అందరికీ టికెట్లు ఇస్తామని చెప్పడం మినహాయిస్తే.. మిగిలిన సందర్భాలలో మంత్రి కేటీఆర్ గానీ, ఇతర ముఖ్య నేతలు గాని సిట్టింగ్ ఎమ్మెల్యే కు తప్పనిసరిగా టికెట్ ఇస్తామని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.
పైగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లాలకు పలువురు ఎమ్మెల్సీలను ఇన్చార్జిలుగా నియమించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీలను ఇన్చార్జులుగా నియమించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలను మరొక జిల్లాకు ఇన్చార్జిగా నియమించారు. కానీ కల్వకుర్తి నుంచి టికెట్ ఆశిస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డిని ఇతర జిల్లాలకు పంపకుండా మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు అది స్థానం ఇన్చార్జిగా నియమించింది. కార్యక్రమాలకు ఆయన విధిగా హాజరవుతూ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలను సజావుగా నిర్వహిస్తున్నారు.
రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ చైర్మన్ గా పని చేయడంతో పాటు, రెండోసారి ఎమ్మెల్సీగా పనిచేస్తున్న దామోదర్ రెడ్డికి ఏ జిల్లాకు కూడా ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వకపోవడం సర్వత్రా చర్చ జరుగుతోంది.. దామోదర్ రెడ్డి రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకోవాల్సిన అధిష్టానం.. ఎందుకు ఆయనకు అవకాశం ఇవ్వలేదు అన్న అంశంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధిష్టానం తో సఖ్యతగా ఉండడం వల్లనే అవకాశం లభించలేదు అని కొందరు అంటూ ఉంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్న కూచుకుల్ల పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదు అని ప్రచారం జరుగుతుండడంతో ఆయనకు అధిష్టానం అవకాశం ఇవ్వలేదన్నట్లు మరికొందరు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.