ఈ నెల 8 న దేవరకద్ర రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభం.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఆల
తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలకే కాదు.. దేవరకద్ర నియోజకవర్గ ప్రజానీకానికి సైతం ఇబ్బందికరంగా ఉన్న రైల్వే గేట్ సమస్య ఎప్పుడు తీరుతుందా అని దశాబ్దాల తరబడి చూసిన ఎదురుచూపులకు ఈనెల 8వ తేదీన తెర పడబోతుంది.
దిశ, దేవరకద్ర: తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలకే కాదు.. దేవరకద్ర నియోజకవర్గ ప్రజానీకానికి సైతం ఇబ్బందికరంగా ఉన్న రైల్వే గేట్ సమస్య ఎప్పుడు తీరుతుందా అని దశాబ్దాల తరబడి చూసిన ఎదురుచూపులకు ఈనెల 8వ తేదీన తెర పడబోతుంది. రైళ్లు వచ్చి పోయే సమయాలలో గంటల తరబడి వేచి ఉండవలసి రావడం వల్ల అత్యవసర వైద్య పొందవలసినవారు పలు సందర్భాలలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
ముఖ్యమైన పనులు ఆగిపోవడం వంటి అనర్ధాలతో జనం పడుతున్న ఇబ్బందులను గుర్తించి 24 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబి ని నిర్మించారు. దీని నిర్మాణానికి పలు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని పనులు పూర్తి చేయించారు. ఇటీవల పనులు ముగియడంతో ఈ నెల 8వ తేదీన ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు.
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శనివారం పూర్తయిన బ్రిడ్జిని పరిశీలించడంతో పాటు.. ఏర్పాట్లపై స్థానిక నాయకులు, అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.