కలిసిరాని మిర్చి రైతు.. దిగుబడులు ఉన్నా అందని గిట్టుబాటు ధర

ఉమ్మడి జిల్లాలో రైతులు వరి, పత్తి తర్వాత ప్రత్యామ్నాయంగా మిర్చి పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.

Update: 2025-04-07 03:07 GMT

దిశ, అలంపూర్ : ఉమ్మడి జిల్లాలో రైతులు వరి, పత్తి తర్వాత ప్రత్యామ్నాయంగా మిర్చి పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మిర్చి పంటకు మంచి గిట్టుబాటు ధర రావడంతో పెద్ద ఎత్తున మిర్చి పంటను సాగు చేస్తూ వస్తున్నారు. దీంతో సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి పంట సాగైంది. పంట కూడా ఏపుగానే పెరగడంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. గత మూడేళ్లుగా నష్టాలతోనే మిర్చి రైతు పంటలను పండిస్తూనే ఉన్నాడు. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల వరకు అప్పులు చేసి మరి పంటలను సాగు చేసుకుని వస్తున్నాడు. కనీసం కూలీలకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. సరైన గిట్టుబాటు ధర ఉండి ఉంటే గత నాలుగేళ్లుగా పేరుకుపోయిన అప్పులు ఈసారి పూర్తిగా తీర్చేవాళ్ళమని రైతులు అంటున్నారు. రైతుబంధు ఏమోకానీ పంటలపై సరైన గిట్టుబాటు ధరలు కల్పించి ఉంటే రైతులకు ఈ పరిస్థితి ఉండేది కాదేమోనని మరి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకుంటే తప్ప భవిష్యత్తులో పంటలను పండించలేమని రైతులు పేర్కొంటున్నారు. మరి కొంతమంది పంట భూములను వదిలేసుకుని కూలీ పనుల కోసం ముంబాయి, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్తున్నారు.

ఏ పంటలు వేసినా..

ఈ ఏడాది రైతులకు అన్ని కష్డాలు వచ్చి పడ్డాయి. కందులు, మొక్కజొన్న, ఉల్లిగడ్డ, పొగాకు, పత్తి తదితర పంటలు సాగు చేసినా, దిగుబడులు ఉన్నా సరైనా గిట్టుబాటు ధర లేదు. బ్రోకర్ల మాయాజాలంతో చేసిన పప్పులను దృష్టిలో పెట్టుకుని ఎంతకో అంతకు అని తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో ఎకరాకు సుమారు లక్షకు పైగా నష్టం వచ్చి అప్పుల్లో కూరుకుపోతున్నాడు. గత నాలుగేళ్లలో ఒక్కసారి మాత్రమే మిర్చి రైతు బాగుపడ్డాడు. ఆ తర్వాత అన్ని నష్టాలు తప్ప లాభాలు మాత్రం ఎక్కడ కనిపించలేదు. మిర్చి పైనే నమ్మకం పెట్టుకొని ఈ ఏడాది రైతులు భారీగా పంటలను పండించారు. ఒక ఎకరాకు 20 క్వింటాల నుంచి సుమారు 30 క్వింటాల వరకు మిర్చి దిగుబడులు వచ్చినా సరైన ధర లేకపోవడం, మిర్చి దింపడానికి వచ్చిన కూలీలకే ఆ డబ్బు సరిపోవడంతో ఎకరాకు రెండు లక్షల వరకు నష్టం వాటిల్లింది. గత మూడేళ్ల క్రితం మిర్చి పంటకు తామర పురుగు ఆశించి దిగుబడులు రాక అప్పుల్లోనే రైతు మిగిలిపోయాడు. ఈ ఏడాది మంచిదిగుబడులు వచ్చాయని అనుకునే లోపే ధరలు పడిపోవడం, అకాల వర్షాలతో మిర్చి పంట నీళ్లపాలు కావడంతో భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Similar News