శోభాయాత్ర భద్రతపై రాజీపడకుండా ఏర్పాట్లు : డీఐజీ చౌహాన్

హనుమాన్ శోభాయాత్ర ఒక పెద్ద ప్రజా సమాహార వేడుక అని,

Update: 2025-04-12 15:28 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: హనుమాన్ శోభాయాత్ర ఒక పెద్ద ప్రజా సమాహార వేడుక అని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని, భద్రత పరంగా రాజీపడకుండా ఏర్పాట్లు చేయాలని జోగులాంబ జోన్-7 డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆదేశించారు.శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే ర్యాలీ బందోబస్తు ను ఆయన జిల్లా ఎస్పీ జానకి తో కలిసి రామ్ మందిర్ చౌరస్తా వద్ద పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన జోన్ పరిధిలోని అందరు ఎస్పీలకు, సంబంధిత పోలీస్ అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై ఫోన్ ద్వారా పలు సూచనలు చేసి మాట్లాడారు. ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించేలా సీసీ కెమెరాల సాయంతో నిఘా ఏర్పాటు చేశామని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ర్యాలీ జరిగే అన్ని ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలను మోహరించామని, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన తెలిపారు.

అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకున్నామని,శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు పోలీస్ విభాగం అప్రమత్తంగా పనిచేస్తుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ, బందోబస్తులో మహిళా పోలీస్ సిబ్బంది, ప్రత్యేక విభాగాలు, క్యూఆర్టీ బలగాలు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి సమన్వయం చేస్తున్నామని,ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ర్యాలీలో పాల్గొనగలిగేలా చక్కటి పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. ర్యాలీ మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్,అత్యవసర టీం లను కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు.

Similar News