మద్దూరు మండలం లో పైలట్ ప్రాజెక్టుగా భూ భారతి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూ భారతి రాష్ట్రంలో మొదటగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలోని.. నాలుగు మండలాలను ఎంపిక చేశారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/మద్దూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూ భారతి రాష్ట్రంలో మొదటగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలోని.. నాలుగు మండలాలను ఎంపిక చేశారు. ఇందులో నారాయణపేట జిల్లా మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. ఈ పథకం అమలు తీరు తెన్నులు.. తదితర అంశాల గురించి సోమవారం హైదరాబాద్ లో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి పథకం అమలుకు సంబంధించి తగిన సలహాలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలం లో భూ భారతి పథకం అమలుకు సంబంధించి మంగళవారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.
సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంవల్లే..!
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న మండలం కావడంతో మద్దూరు మండలాన్ని భూ భారతి నీ పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఎంపిక చేశారు. ఈ కారణంగా మద్దూరు మండలం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందనుంది.
భూముల వివరాలు :
మద్దూరు మండలం లో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు అన్నింటిలో కలిపి మొత్తం 30,621 ఎకరాల పొలం ఉండగా.. అందులో 30,473 ఎకరాలు వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి మొత్తం 47, 706 మంది పట్టాదారులు ఉన్నారు.
సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్న జనం :
సంవత్సరాల తరబడి అపరిచితంగా ఉన్న భూముల సమస్యలు కొత్త చట్టం భూ భారతి ద్వారా పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో పలువురు రైతులు, భూముల యజమానులు ఆశిస్తున్నారు. భూముల మోఖా పై ఒకరు, పట్టాలు మరొకరిపై ఉన్నాయి. మరికొందరికి రికార్డులలో భూములు ఎక్కువగా ఉండి.. మోఖా పై తక్కువగా ఉన్నాయి. వారసత్వంగా వచ్చే భూములు.. ప్రభుత్వపరంగా వచ్చిన భూముల బాగా పరిష్కారాల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు అధికారులు.. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల సమస్యలు పరిష్కారం కావాల్సింది పోయి.. మరిన్ని ఎక్కువయ్యాయి. భూ భారతి ఈ సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయడంతో పాటు.. పైలట్ ప్రాజెక్టుగా తమ మండలాన్ని ఎంపిక చేయడం పట్ల మద్దూరు మండల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గ్రామసభల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ :
మండలం లో ఈనెల 17 మొదలు నెలాఖరు వరకు అధికారులు గ్రామసభలు నిర్వహించి భూములకు సంబంధించిన ఫిర్యాదులను తీసుకుంటారు. ఈ సభలు నిర్వహించడానికి ముందు ఆయా గ్రామాలలో విస్తృత ప్రచారం చేస్తారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో, అదనపు కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్ తదితరులు గ్రామ సభలలో పాల్గొని ఫిర్యాదులను తీసుకుంటారు. గ్రామాల వారీగా ఎన్ని ఫిర్యాదులు అందాయి. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టం ఆధారంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే నెల ఆఖరి వరకు సమస్యలను పరిష్కరిస్తారు.