స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతున్నాయి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతున్నాయని,42 శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి యం.శ్రీనివాస్ సాగర్ డిమాండ్ చేశారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్; స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కుట్రలు జరుగుతున్నాయని,42 శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి యం.శ్రీనివాస్ సాగర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ సమాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వేపై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని,సర్వేపై అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ముందుకు వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కుల గణనపై చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయిలో సమగ్ర కుల గణన నిర్వహించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ అది పూర్తిస్థాయిలో జరగలేదని,పట్టణ ప్రాంతాలలో,హైదరాబాద్ నగరంలో చాలా మంది ఇండ్లకు సర్వే అధికారులు వెళ్లలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ,లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంగి లక్ష్మీకాంత్,కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న,దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి.శేఖర్,కాశికాపుడి యువజన సంఘం యూత్ క్యాషియర్ కోమల్ కుమార్,భూత్ఫూర్ మండల కన్వీనర్ డి.ఆంజనేయులు,తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.