ఖాకీ దుస్తుల వెనుక కారుణ్యం దాగుంది

ఖాకీ దుస్తులు వేసుకుని కాఠిన్యంతో లాఠీ ఝులిపించడం ఒక్కటే కాదు..ఆపదొచ్చినా,అవసర మోచ్చినా,అక్కరకొచ్చినా కారుణ్యం చూపించి ఆదుకుంటామని నిరూపించారు పాలమూరు పోలీసులు.

Update: 2024-11-17 14:44 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఖాకీ దుస్తులు వేసుకుని కాఠిన్యంతో లాఠీ ఝులిపించడం ఒక్కటే కాదు..ఆపదొచ్చినా,అవసర మోచ్చినా,అక్కరకొచ్చినా కారుణ్యం చూపించి ఆదుకుంటామని నిరూపించారు పాలమూరు పోలీసులు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం గ్రూప్-3 పరీక్ష నిర్వహించారు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థి నీరసంతో,శక్తి లేక పరీక్షా కేంద్రం గేటు ముందు కళ్ళు తిరిగి కిందపడిపోయింది. ఈ క్రమంలో మఫ్టీలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ వెంకట్రాములు అమ్మాయిని పట్టుకొని పరీక్షా కేంద్రం గేటు లోపలికి తీసుకెళ్ళి మంచి నీటిని అందించారు. కుదుట పడిన తర్వాత పరీక్షా హాల్లో కూర్చోబెట్టి మానవత్వం చాటుకున్నాడు. ఇంకో మహిళా అభ్యర్థి తాను రాయాల్సిన పరీక్షా కేంద్రానికి బదులు మరో కేంద్రానికి వచ్చి..కన్ఫ్యూజ్ అవుతూ,టైం అయిపోతుందని గాబరా పడుతుంది. దీంతో డ్యూటీ లో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య (నెంబర్ 1369) విషయం తెలుసుకొని వెంటనే తన బైక్ పై ఆమె రాయాల్సిన పరీక్ష కేంద్రానికి అర నిమిషం ముందే చేర్చాడు. ఇద్దరు అభ్యర్థులు క్షణం కాలం ఆలస్యం అయినా..గ్రూప్-3 పరీక్ష రాసే అవకాశం కోల్పోయేవారు. సకాలంలో విద్యార్థుల ఇబ్బందులను గమనించి ఆదుకున్న ఏఎస్ఐ వెంకట్రాములు,ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య లను జిల్లా ఎస్పీ జానకి అభినందించారు.


Similar News