అభివృద్ధి కోసమే వచ్చా… అభివృద్ధి చేసి ప్రజల ముందు ఉంచా...!

నారాయణపేట నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సాగుతుంది.

Update: 2023-11-20 12:10 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సాగుతుంది. ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడితే తప్ప ఏ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తాడో అంచనా వేయడం కష్టమని నియోజకవర్గ ఓటర్లు చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో బిఎల్ఎఫ్ అభ్యర్థి కుంభం శివకుమార్ రెడ్డి పై ఎస్. రాజేందర్ రెడ్డి 68,767 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఈసారి సుమారు 30 వేల మెజార్టీ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రెడ్డి తో పాటు నాయకులు, పార్టీ శ్రేణులు కసరత్తులు చేస్తున్నారు.

నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి...

అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నారాయణపేట నియోజకవర్గం ప్రజలందరి సమిష్టి కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి చెబుతున్నారు. ప్రజల సహకారం లేనిదే అభివృద్ధి సాధ్యం కాదని తనకు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు సహకరించడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. నారాయణపేట నియోజకవర్గంకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే పాలమూరు-రంగారెడ్డి ద్వారా సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే పలుమార్లు పేర్కొన్నారు.


ప్రజలే నా బలం...

పెద్ద మనసుతో రెండోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించిన నారాయణపేట నియోజకవర్గం ప్రజలే తన బలమని మూడోసారి కూడా తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తారన్న నమ్మకం ఉందని ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసమే రాజకీయంలోకి వచ్చానని ఇచ్చిన మాటకు కట్టుబడి కమిట్ మెంట్ ప్రకారం నియోజకవర్గ అభివృద్ధి చేసి చూపించానని తన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల చేతిలో ఉందని చెబుతున్నారు.


Similar News