గుర్లపల్లిలో భారీ అగ్ని ప్రమాదం..నగదు, విలువైన ఆభరణాలు దగ్ధం
మక్తల్ మండలంలోని గుర్లపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం
దిశ,మక్తల్: మక్తల్ మండలంలోని గుర్లపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరుగగా రెండు గుడిసెలు పూర్తిగా కాలి బూడిదైన సంఘటన జరిగింది. రెండు గుడిసెలకు తాళం ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు.ఈ ప్రమాదంలో రూ. ఐదు లక్షల నగదు, అర తులం బంగారు, వంద తులాల వెండి వస్తువులు,నిత్యావసర సరుకులు,వంటపాత్రలు,బట్టలు కాలి బూడిద అయ్యాయి.ఇటీవలనే మేకలు అమ్మగా వచ్చిన రెండు లక్షల 60 వేల నగదును సందప్ప గుడిసెలో ట్రంకు పెట్టెలో పెట్టిన నోట్ల కట్టలు కాలీ బూడిదయ్యాయి. మొగలప్ప గుడిలో రెండు లక్షల పదివేల నగదు, అర తులం బంగారం వంద తులాల వెండి వస్తువులు, కాలి బూడిద అయ్యాయి.
వీటితో పాటు నిత్యావసర వస్తువులు, కట్టుకునే బట్టలు వంటపాత్రలు,మంటలో కాలి అగ్నికి ఆహుతి అయ్యాయి. శనివారం కావడంతో ఇంటి ఇలవేల్పు మక్తల్ పడమటి ఆంజనేయ స్వామికి గండ జ్యోతి నైవేద్యం చేయాలని ఉదయం నంది గోళ సందప్ప, మొగలప్ప అన్నదమ్ములు కుటుంబ సభ్యులతో గుడిసెలకు తాళం వేసి వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జడ్పీటీసీ గవినోళ్ళ లక్ష్మారెడ్డి ఇతర నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ సతీష్ కుమార్,పోలీసులు జరిగిన సంఘటనపై ఆరా తీస్తున్నారు.