తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేయండి: డీకే అరుణ

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.

Update: 2023-04-24 10:36 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. అకాల వర్షం కారణంగా జోగులాంబ గద్వాల, కరీంనగర్ తదితర జిల్లాలలో యాసంగిలో పండించిన మొక్కజొన్న పంట పెద్ద మొత్తంలో తడిసిపోయిందని ఆమె చెప్పారు. ప్రభుత్వం మొక్కజొన్న గిట్టుబాటు ధర రూ. 1962 నిర్ణయించగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం వల్ల తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆమె దీనివల్ల అప్పుల బాధలు తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని డీకే అరుణ పేర్కొన్నారు.

మాది రైతు ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మొక్కజొన్నతో పాటు, వరి ధాన్యం తదితర పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఆమె వాపోయారు. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో ఆయా జిల్లాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు నష్టపోయిన రైతులను గుర్తించి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News