అచ్చంపేటలో బీఆర్ఎస్ ధర్నా
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పర్యాయాలు వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్యుడిపై... BRS Protest at Acchampet
దిశ, అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పర్యాయాలు వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపిన విషయం తెలిసిందే. మరోసారి వంటగ్యాస్ ధరలు పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఖాలీ సిలిండర్లతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం గతంలో రూ. 400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను నేడు రూ.1200 కు పెంచి పేద ప్రజలపై మరింత మోయలేని భారాన్ని మోపిందన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పోగొట్టేందుకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బీరాలు పలికిన బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.