అరకొర వసతులతో ఎస్సీ వసతి గృహం
కల్వకుర్తి పట్టణంలోని పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి పట్టణంలోని పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. కనీస స్థాయిలో మౌలిక వసతులు లేక విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గదులకు కిటికీలు సరిపడు లేవు. వసతిగృహంలో ఆరు నుంచి పదోతరగతి వరకు దాదాపు 120 పైగా బాలురు ఉంటారు. విద్యార్థులకు సరిపడా మరుగదొడ్లు, స్నానపు గదులు లేవు. దీంతో విద్యార్థులు ఆరుబయటే స్నానాలు, మరుగుదొడ్లకు వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. ఆ ప్రదేశం చుట్టుపక్కల ఖాళీస్థలం కావడంతో దోమల బెడద ఎక్కువగా ఉంది. అలాగే మంచాలు ఉన్నా .. సరిపడా దుప్పట్లు లేక విద్యార్థులు నానా యాతన పడుతున్నారు. ఫ్యాన్లు పాడై మూలకు చేరాయి. దీంతో అపాయం అని తెలిసిన అలాగే నిద్రిస్తున్నారు. దుప్పట్లు మూడేళ్ళుగా పంపిణీ చేయకపోవడంతో.. నేలపైనే, భవనాలపై నిద్రిస్తూ..తమ బ్రతుకులు ఇంతే అని కాలాన్ని నెట్టుకొస్తున్నారు.
ట్రంకు పెట్టెలు ఇవ్వపోవడంతో విద్యార్థుల పుస్తకాలు ఆరుబయటే ఉంటున్నాయి. భోజనాలు రుచిగా ఉండడం లేదని విద్యార్థులు తెలిపారు. అలాగే భోజనశాల పక్కకు మురికి నీళ్ళు, చెత్త చెదారం దర్శనమిస్తున్నాయి. వాటర్ ప్యూరి పైడ్ మెషిన్ పాడవడంతో.. మరమ్మత్తు చేపించే నాథుడే కరువయ్యాడు. డ్రైనేజ్ సరిగ్గా లేకపోకపోవడంతో దుర్వాసన వస్తున్న పట్టించుకొనే వారె లేరు. మిషిన్ భగిరత పైపులైన్ ద్వారా ఈ నీటిని బాలుర వసతిగృహానికి కూడా సరఫరా చేస్తున్నారు. గత 4 రోజులుగా సరిపడు నీళ్ళు వదలక పోవడంతో.. 3 - 4 రోజులుగా కొంత మంది విద్యార్థులు స్నానాలు చేయడం లేదు. అరకొర వసతులతో ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు.
హాస్టల్ వార్డెన్ పట్టించుకోకపోవడంతో గత 20 రోజుల క్రిందట హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు గొడవ జరిగింది. ఈ విషయం బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఈ నెల 22వ తేదిన 8వ తరగతి విద్యార్థి 9 వ తరగతి విద్యార్థిపై దాడి చేయడంతో ..కుడి చెయ్యి విరిగి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై ఆదివారం ఎస్సీ వసతి గృహ పరిస్థితిపై ‘దిశ పత్రిక ’ విజిట్ చేయగా.. మౌలిక వసతుల కొరత, హాస్టల్లో గలాటా గురించి బయట పడింది. వార్డెన్ మా బాగోగుల గురించి పట్టించుకోడని, సరైన మౌలిక వసతులు లేక నిత్యం ఇబ్బంది పడుతున్నామని కంటతడి పెట్టుకున్నారు. మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేస్తాలేరన్నారు. ఏండ్లు గడిచిన స్థాన చలనం లేకపోవడంతో వార్డెన్ ఆడింది ఆటే పాడింది పాటే లాగుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై హాస్టల్ వార్డెన్ పై ఆరా తీయగా.. ఇది ఇక్కడే మామూలే అని, విద్యార్థులు చాడీలు చెప్తున్నారని సమాధానమిచ్చారు. అరకొర వసతులు, సౌకర్యాల నడుమ తమ చదువు సాగేదెలా..? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.