రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో కృషి చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖ

దిశ, నారాయణపేట ప్రతినిధి : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేసి నారాయణ పేటను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. గత జనవరి 7 న జరిగిన రోడ్ సేఫ్టీ మీటింగ్ లో చర్చించిన అంశాలు, చేపట్టిన పనుల గురించి శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ తో సమావేశానికి రావాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖ పరంగా రోడ్డు భద్రత పై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల వారీగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
జిల్లాలో గుర్తించిన బ్లాక్ పాయింట్లలో మాగనూరు మండలం గుడే బల్లూరు, మక్తల్ పట్టణం, మరికల్ మండలంలో పెద్ద చింతకుంట వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోస్గి మండలంలోని నాచారం వద్ద ఇంకా రహదారి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అలాగే ప్రధాన రహదారుల పక్కనే ఉన్న పాఠశాలలు, కళాశాలల వద్ద కూడా బారీకేడ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అలాంటి పాఠశాలలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే అక్కడ కూడా బారీ కేడ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే జిల్లాలో 2021 నుంచి 2025 వరకు మొత్తం 688 రోడ్డు ప్రమాదాలు జరిగితే వాటిలో 404 మంది మృతి చెందారని, మిగతా వారికి గాయాలు అయ్యాయని ఎస్పీ వెల్లడించారు. ఆయా ప్రమాదాలు ఎక్కువగా డ్రైవర్లు మద్యం తాగి నడపటం వల్ల, డ్రైవర్ల అజాగ్రత్త వల్లె జరిగాయని, ఆ ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం నుంచి రాత్రి వేళ అది కూడా జాతీయ రహదారులపైనే జరిగాయని ఆయన తెలిపారు.
తమ శాఖ పరంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రోడ్ సేఫ్టీ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. జిల్లాలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలను కూడా ఎస్పీ వివరించారు. రోడ్ సేఫ్టీ మీటింగ్ లో చర్చించిన అంశాలను నమోదు చేసుకుని శాఖల వారీగా అధికారులు చేయాల్సిన, చేస్తామన్న పనులను వారికి మధ్యలో గుర్తు చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బి డి ఈ రాములు కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బేన్ షాలోమ్, డీఎస్పీ లింగయ్య , డీఎం అండ్ హెచ్ ఓ సౌభాగ్య లక్ష్మి, ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య, సీఐ లు రామ్ లాల్, శివ శంకర్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించాలి..
జిల్లా కేంద్రంలో ఏప్రిల్ లో 20.04.2025 నుంచి 26.04.2025 వరకు జరగబోయే సార్వత్రిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్ ఎస్ సి కి సంబంధించి మూడు సెంటర్లలో 600 మంది విద్యార్థులు, అలాగే ఇంటర్మీడియట్ ఐదు సెంటర్లలో 990 విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. ఆయా పరీక్షల పూర్తి ఏర్పాటును జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షించాలని ఆమె ఆదేశించారు. అధికారులు అందరూ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ... పరీక్షలలో సెంటర్ల దగ్గర పూర్తి స్థాయి బందోబస్తు నిర్వహిస్తామని చెప్పారు.