ఈ నెలాఖరు వరకే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు తుది గడువు : మహబూబ్ నగర్ కలెక్టర్

ఎల్ఆర్ఎస్ కి ఫీజు చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకు

Update: 2025-03-26 12:40 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఎల్ఆర్ఎస్ కి ఫీజు చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకు మాత్రమే గడువు మిగిలి ఉందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ,2020 లో దరఖాస్తు చేసుకున్న లేఅవుట్ యజమానులు,డెవలపర్స్,ప్లాట్ల యజమానులు ఈ నెలాఖరు మార్చి 31 లోగా ఫీజు చెల్లించి ప్రభుత్వం కల్పిస్తున్న 25 శాతం రాయితీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని,గడువు పొడిగింపు ఉండదని కలెక్టర్ తెలిపారు.ఎల్ఆర్ఎస్ పై లేఅవుట్ డెవలపర్లు,సర్వేయర్లు,డాక్యుమెంట్ రైటర్ లకు యజమానులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,ప్లాట్ల యజమానులు రెగ్యులరైజ్ చేసుకోవాలని,ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.నిషేధిత స్థలం లేదా చెరువు,కుంట కింద లేకుంటే ప్లాట్ల యజమాని ఫోన్ కు నేరుగా ఎంత డబ్బులు కట్టాలో సమాచారం వెళుతుందన్నారు.

ఎల్ఆర్ఎస్ ఉంటే ప్లాటుకు రక్షణ ఉంటుందని,ఎవరు ఆక్రమించుకోవడానికి అవకాశం ఉండదని అదేవిధంగా లే అవుట్ ప్లాట్ల ప్రాంతాన్ని మున్సిపాలిటీ ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు.భవిష్యత్తులో ప్లాటు అమ్ముకోవాలనుకున్న ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాటు కు మంచి డిమాండ్ ఉంటుందని తెలియజేశారు.ఎల్ఆర్ఎస్ కు సంబంధించి దరఖాస్తు దారులు,ప్లాటు యజమానులు ఏవైనా సందేహాలు,వివరాల కోసం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 08542-241165,మహబూబ్ నగర్,నగరపాలక సంస్థ లో హెల్ప్ లైన్ నెంబర్ 7093911352 ను సంప్రదించవచ్చని తెలిపారు.ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమాచారం పొందవచ్చని అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులు https://lrs.telangana.gov.in వెబ్ సైట్ లాగిన్ ద్వారా కూడా ఫీజు చెల్లించ వచ్చని తెలిపారు.మున్సిపల్ కమిషనర్లు,పంచాయతీ అధికారులు బిల్డర్లు,లే అవుట్ ప్లానర్లు ప్లాటు యజమానులతో సంప్రదించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని కోరారు.

Similar News