దారుణం..మృతదేహంపై ఉన్న బంగారం చోరీ
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.
దిశ,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆసుపత్రి మార్చురీలో మహిళ శవంపై బంగారుని దొంగిలించిన సంఘటన కలకలం రేపింది. మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెరిస్సా అనే మహిళ మృతి చెందింది. దీంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ క్రమంలో మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై ఉండాల్సిన బంగారు లేకపోవడాన్ని గమనించారు. రెండు పుస్తెలు,పుస్తగుండ్లు,చెవి కమ్మలు,ముక్కుపుడక,కాలుమెట్టలు లేవని సంబంధిత మార్చురీ సిబ్బందిని అడుగగా మీరే తీసారేమోనని సమాధానం దాటవేస్తున్నారని మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులు వాపోయారు. అసలే తమ పాప చనిపోయిందన్న దుఃఖంలో ఉండగా.. మృతదేహంపై ఉన్న బంగారుని దొంగిలించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. కనీస మానవ విలువలు లేకుండా ఇలా అపహరించడం ఎంతవరకు సబబు అని సంబంధిత వైద్య సిబ్బందిని అడిగారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో సైతం వాటి వివరాలను తెలిపామన్నారు సుమారు తులం బంగారు అపహరించారని తెలిపారు. సంబంధిత మార్చురీ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని మృతి చెందిన కుటుంబ సభ్యులు తెలిపారు.