రాజాపూర్ ఏటీఎంలో రూ. 7 లక్షల 83 వేల చోరీ.. ఇంటి దొంగల పనేనా..?

రాజాపూర్ మండల కేంద్రంలోని ఇండిక్యాష్ ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు ఈ నెల 10వ తేదీ రాత్రి చోరీకి పాల్పడ్డారు.

Update: 2023-02-16 16:00 GMT

దిశ, జడ్చర్ల/రాజాపూర్: రాజాపూర్ మండల కేంద్రంలోని ఇండిక్యాష్ ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు ఈ నెల 10వ తేదీ రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలోని రూ. 7 లక్షల 83 వేల నగదును అపహరించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన 10వ తేదీన రాత్రి జరుగగా 16వ తేదీ ఏటీఎం రూట్ ఇంచార్జి రాఘవేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏటీఎం వద్ద పరిసరాలను పరిశీలించి క్లూస్ టీంను రప్పించి ఆధారాల కొరకు అన్వేషించారు. కాగా 10వ తేదీ రాత్రి చోరీకి గురైన ఏటీఎంను రూట్ అధికారి గుర్తించి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా, ఏటీఎంను మూసేయకుండా అలానే ఉంచడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 

ఇంటి దొంగల పనేనా..?

10వ తేదీ రాత్రి ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డ ఘటనను గుర్తించిన బ్యాంకు అధికారులు, 16వ తేదీ వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండడం, చోరీకి గురైన ఏటీఎంను మూసేయకుండా అలానే ఉంచడం ఏంటనే ప్రశ్న అర్థం కావడం లేదు. 10 తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏటీఎం ఎదుట ఢిల్లీ పాసింగ్ కారు నిలిచి ఉన్నట్లు సీసీ ఫుటేజ్ లో లభ్యమయింది.

ఈ ఘటనపై రాజాపూర్ ఎస్ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఏటీఎం అధికారుల ప్రాసెస్ కావడానికి ఆరు రోజుల సమయం పట్టిందని, వారి అనుమతితో గురువారం ఏటీఎం రోడ్డు ఇంచార్జి రాఘవేందర్ ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారన్నారు. మండలంలోని ప్రధాన కూడలిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా అన్వేషిస్తామని 10 తేదీ జరిగిన చోరీపై 16వ తేదీ ఫిర్యాదు చేయడంపై ఏటీఎం బ్యాంక్ సిబ్బందిపై ఉన్న అనుమానాలు కూడా పరిగణలోకి తీసుకొని విచారణ చేపడతామని తెలిపారు.

Tags:    

Similar News