జోగులాంబ బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లు సిద్ధం

ఉత్తర వాయిని తుంగతీరంలో ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

Update: 2024-10-02 14:25 GMT

దిశ, అలంపూర్ టౌన్: ఉత్తర వాయిని తుంగతీరంలో ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ అలంకారాలలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. మొదటిరోజు ఉదయం 8 గంటలకు స్వామివారి ఆనతి స్వీకరణ, యాగశాల ప్రవేశము గణపతి పూజ,పుణ్యాహవాచనము ఋత్విక్ వరణము మొదలగు కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం ద్వజారోహణ కార్యక్రమంతో జోగులాంబ దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు సహస్రనామార్చనలు,చండి హోమాలు,కొలువు పూజలు,కుమారి సుహాసిని పూజలు,మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 9వ తేదీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహిస్తారు. పదో తేదీ దుర్గాష్టమి సందర్భంగా..జోగులాంబ అమ్మవారి రథోత్సవం, అదేవిధంగా శుక్రవారం మహార్నవమి కాలరాత్రి పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజు అమ్మవారి ఆలయంలో పూర్ణాహుతి పూజా కార్యక్రమాలతో పాటు తుంగభద్ర నది హారతి, సాయంత్రం ఏడు గంటలకు తుంగభద్ర నదిలో స్వామి అమ్మ వార్ల తేప్పోత్సవము నిర్వహిస్తారు. అనంతరం ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో సురేందర్ తెలిపారు. భక్తుల కోసం చలవ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. స్వామి అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా అలంకరించారు.


Similar News