ఆర్టీసీ బస్సులో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ

తెలంగాణ ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు.

Update: 2024-08-19 03:48 GMT

దిశ, గద్వాల: తెలంగాణ ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన చెందిన సంధ్య సోమవారం ఉదయం గద్వాల డిపోకు చెందిన టీఎస్ 33 టి 2543 నెంబర్ గల ఆర్టీసీ బస్సు గద్వాల్ నుండి వనపర్తి కి పల్లె వెలుగు బస్సు లో ప్రయాణిస్తుంది. వనపర్తి కి దాదాపు 15 కి.మీ దూరంలో నాసినపల్లి గ్రామ స్టేజ్ వద్ద గర్భిణీకి పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ జి.భారతి అప్రమత్తమై డిపో మేనేజర్‌కు సమాచారం అందించారు. డీఎం సూచనల మేరకు ఒక నర్సు, మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు.

ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వనపర్తి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ భారతీతో పాటు నర్సు, మహిళా ప్రయాణికులను ఆర్టీసి‌ ప్రయాణికులు, అధికారులు‌ అభినందనలు తెలియజేశారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమని అన్నారు.


Similar News