కృష్ణానది తీరంలో జోరుగా అలవివలల మాఫియా
నదులను..నదుల వనరులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే మత్స్య మాఫియాతో చేతులు కలిపి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో చేపపిల్లల సంపదను కొల్లగొడుతున్నారు.
దిశ,పెంట్లవెల్లి : నదులను..నదుల వనరులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే మత్స్య మాఫియాతో చేతులు కలిపి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో చేపపిల్లల సంపదను కొల్లగొడుతున్నారు. కృష్ణా నదిలో రాత్రి వేళల్లో అలవి వలలు విసిరి పిల్ల దశలోనే చిదిమేసి వాటిని ఎండబెట్టి కోట్ల రూపాయాల వ్యాపార మాఫీయాకు కేరాఫ్ అడ్రస్ గా అధికారుల పాత్ర పోషిస్తున్నారు. అధికారుల అండదండలతో కృష్ణానది తీరప్రాంతంలో అలవివలల వేట జోరుగా కొనసాగుతోంది. మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వేచించి నదిలో చేపపిల్లలను వదులుతుంటే అధికారుల కనుసన్నల్లో కొందరు అలవివలలను ఉపయోగించి చేపలను పట్టి స్థానిక మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా వారి కడుపుపై కొడుతున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా నది తీర ప్రాంతాలైన సోమశిల, మంచాలకట్ట,మల్లేశ్వరం గ్రామాల కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో అలవివలల వేట జోరుగా కొనసాగుతోంది. పోలీసు,మత్స్యశాఖ అధికారులకు అలవివలల దళారుల నుంచి ఒక్కో పట్టుకు దాదాపు.రూ.50 వేల వరకు ముడుపులు అందుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలకు చెందిన చేపలు పట్టే వాళ్ళని రప్పించి మరి అలవి వలలు విసిరి చేపపిల్లలను పడుతున్నారంటే ఈ ప్రాంతంలో సంబంధిత ఉన్నతాధికారుల నిర్లక్ష్య ధోరణిని గమనించవచ్చు.