ప్రహరీ లేని ప్రభుత్వ పాఠశాల.. పశువుల పాకగా..
మండల పరిధిలోని మారేడు మాన్ దిన్నే గ్రామ పంచాయతీ

దిశ,పెద్ద కొత్తపల్లి : మండల పరిధిలోని మారేడు మాన్ దిన్నే గ్రామ పంచాయతీ వేడుకరావుపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాలకు ఎన్నో ఏళ్ల నుంచి ప్రహరీ లేదు. దీంతో పాఠశాల భవనంలో పశువులు,మేకలు,కుక్కలు పడకేస్తున్నాయని ఆ తండా వాసులు వాపోతున్నారు. ప్రధానంగా విద్యార్థుల చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయి.ఈ విషయాన్ని తండావాసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రహరీ నిర్మాణం చేపట్టకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ పాఠశాల నిలిచిందని చెప్పాలి. కారణం ఈ తండా నల్లమల అటవీ సరిహద్దులో ఉంది. ప్రభుత్వాలు,పాలకులు మారినా ఈ సమస్యను పరిష్కరించలేక పోతున్నారని,ఇది తమ కర్మ అని వేడుక రావు పల్లి తండావాసులు వాపోతున్నారు.
పాఠశాలకు ప్రహరీ లేనందున విద్యార్థులకు విద్యాబోధన జరుగుతున్న సమయంలో విష సర్పాలు, కుక్కలు ,పశువులు , గేదెలు సైతం పాఠశాల ఆవరణలో సంచరిస్తుంటాయి.దీంతో విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉన్నాయని,దీంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థుల విద్యాబోధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం మూలంగా తమ పిల్లలకు రక్షణ లేకుండా పోతోందని తల్లిదండ్రులు భావిస్తూ ఇతర ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా కొంతమంది వ్యక్తులు పాఠశాల వరండాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తండా వాసులు అంటున్నారు. గ్రామ పెద్దలు, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలని వేడుక రావు పల్లి తండా వాసులు కోరుతున్నారు.