కలుషిత ఆహారం తిని 100 మందికి అస్వస్థత..సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన వందమంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన నారాయణపేట జిల్లా మాగునూరు మండల కేంద్రంలో జరిగింది.
దిశ, మక్తల్ / మాగనూర్ : ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన వందమంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన నారాయణపేట జిల్లా మాగునూరు మండల కేంద్రంలో జరిగింది. బుధవారం స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో మధ్యాహ్నం సాంబార్ గుడ్లతో కూడిన భోజనం చేసిన విద్యార్థులకు కొద్ది నిమిషాల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్క విద్యార్థి అపారమైన స్థితిలోకి వెళ్లడం..వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి తో బాధపడ్డారు. ఉపాధ్యాయులకు విషయం తెలపడంతో..ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. విషయం తెలుసుకున్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాగనూర్ కు వెళ్లి పరామర్శించారు. సాయంత్రం వరకు కొంతమంది విద్యార్థులు కోలుకోగా..కొందరు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేందుకు మక్తల్ కు తరలించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్సను అందించాలని జిల్లా వైద్యాధికారి సౌభాగ్య లక్ష్మి కు ఎమ్మెల్యే ఆదేశించారు. మక్తల్ నుంచి 15 మంది విద్యార్థులకు సీరియస్ గా ఉండటంతో..మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. విద్యార్థులను ఆస్పత్రులకు పంపించిన అనంతరం జిల్లా ట్రైని కలెక్టర్ గరీమ వచ్చి అధికారులు తో సంఘటన విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు ఎంక్వయిరీ చేశారు. ఈ ఘటనపై మక్తల్ సీఐ, మాగనూరు, కృష్ణ ఎస్సైలు విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఘటనపై ముఖ్యమంత్రి ఆరా
అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మెరుగైన వైద్యంను అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని.. నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ సీఎం ఆదేశించారు.