దేవుడు వరమిచ్చినా.. ఐదేళ్లుగా అరిగోస

Update: 2024-11-13 02:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదన్నట్టు తయారైంది మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామ రైతుల పరిస్థితి. ఐదేండ్లుగా చేస్తున్న పోరాటానికి స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులు రెండు నెలలుగా జిల్లా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. ఎవరి నుంచీ సరైన స్పందన రావడం లేదు.

అడవిగా మారిన పట్టా భూములు

మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం నారాయణపురంలో 1605 ఎకరాల ఫారెస్టు ల్యాండ్ ఉంది. అయితే 2017-18లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో 22 పట్టా భూముల సర్వే నంబర్లను అటవీ భూమిగా మార్చేశారు. అధికారులు చేసిన తప్పిదానికి ఐదేండ్లుగా రైతులు అరిగోస పడుతున్నారు. సర్వే నం.149, 150, 154, 165, 166, 168, 200, 201, 202, 203, 205 లోని 1403.12 ఎకరాల పట్టా ల్యాండ్ ఫారెస్టుగా మార్చేశారని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆగస్టు 2న సీసీఎల్ఏకు సమగ్ర నివేదికను సమర్పించారు. జిల్లా అటవీ అధికారి కూడా క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. అఖర్బంద్, వసూల్ బాకీ రిజిస్టర్ లను కూడా పరిశీలించారు. వాటి ప్రకారం సర్వే నం.149లో 174.03 ఎకరాలు, 150లో 262.10 ఎకరాలు, 154లో 308.05 ఎకరాలు, 165లో 468 ఎకరాలు, 166లో 113.34 ఎకరాలు, 168లో 93.37 ఎకరాలు మొత్తం 1420 ఎకరాలు పట్టాగానే ఉన్నాయి. ఆ తర్వాత 1962 నుంచి అనేక ట్రాన్సక్షన్లు కూడా చోటు చేసుకున్నాయి. ఆ కాలంలోనే 64 లావాదేవీలు జరిగాయి.

అన్నదాతల పోరాటం

పట్టా ల్యాండ్ ఫారెస్ట్ గా నమోదు కావడంతో ఆయా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేచర్ ఆఫ్ ల్యాండ్ ను మార్చేయడంతో హక్కులు లేకుండాపోయాయి. ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలకు దూరమయ్యారు. నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసర పరిస్థితుల్లోనూ అమ్ముకోలేకపోయారు. ఐదేండ్లుగా వారికి పాసు పుస్తకాలు లేవు. రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు, రుణ మాఫీ వంటి సంక్షేమ పథకాలకూ దూరమయ్యారు. అధికారులు చేసిన తప్పిదానికి ఐదేండ్లుగా వందలాది మంది రైతులు అరిగోస పడుతున్నారు. వీటిని తిరిగి పట్టా భూములుగా మార్చాలని అప్పటి నుంచి రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. గ్రామం మొదలుకొని హైదరాబాద్ వరకు ధర్నాలు చేశారు. నిరసన తెలిపారు. సర్పంచు నుంచి మంత్రుల వరకు, వీఆర్వో నుంచి చీఫ్ సెక్రటరీ వరకు దరఖాస్తులు సమర్పించారు. కలెక్టర్ సిఫారసు లేఖలో పేర్కొన్న రెఫరెన్స్ ల సంఖ్యను చూస్తేనే ఈ రైతుల పడిన మానసిక ఆవేదన, చేసిన పోరాటం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క దరఖాస్తుతో పరిష్కారం కావాల్సిన సమస్యకు 17 రెఫరెన్సులను కలెక్టర్ జత చేశారు. ఇందులో దరఖాస్తులు, సర్వే రిపోర్టులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లేఖలు, ప్రజాప్రతినిధుల అభ్యర్ధనలు వంటివి ఉన్నాయి.

సీసీఎల్ఏ ఉత్తర్వులు వచ్చినా..

రైతుబంధు, రైతుబీమా వంటివి వర్తించట్లేదని, సమస్యను పరిష్కరించాలని జూలైలో రైతులు సెక్రెటరేయిట్ ను ముట్టడించారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ప్రిన్సిపల్ సెక్రెటరీని పిలిచి మాట్లాడారు. పేద రైతులను దృష్టిలో ఉంచుకొని వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు. నెల రోజులైనా అధికారుల్లో కదలిక లేకపోవడంతో రైతులు మళ్లీ మంత్రిని కలిశారు. దీంతో నారాయణపురంలో సర్వే నం.149, 150, 154, 165, 166, 168లోని 1398.03 ఎకరాల పట్టా భూమి అడవి/ఫారెస్టుగా నమోదైందని, వీటిని తిరిగి పట్టాగా మార్చాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సెప్టెంబర్ 11న జీవో 94 జారీ చేశారు. ‘అడవి’ని డిలీట్ చేయడానికి సీసీఎల్ఏ, కలెక్టర్ కు జీవోలో అధికారులు ఇచ్చారు. కానీ సీసీఎల్ఏ మళ్లీ కలెక్టర్ కి లేఖ రాశారు. అయితే కలెక్టర్ లాగిన్ లో కావడం లేదు. దాంతో అక్టోబర్ 26న మళ్లీ లెటర్ రాశారు. సీసీఎల్ఏలోనే డిలీట్ చేయాలని కోరారు. బ్యాక్ ఎండ్ లోనే చేయాలని, కలెక్టర్ స్థాయిలో కావడం లేదంటూ తిరిగి రాశారు. ఇది తమ మా వల్ల అవ్వట్లేదని, టెక్నికల్ ఇష్యూ అని కలెక్టర్ అంటున్నారు. ఆ లెటర్ తీసుకుపోయి మళ్లీ సీఎమ్మార్వో పీడీ మందా మకరందుకి ఇచ్చినట్లు రైతులు చెప్తున్నారు. ఆయన ఇప్పటి వరకు ప్రాసెస్ స్టార్ట్ చేయడం లేదని బాధితుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ధారావత్ రవి ‘దిశ’కు వివరించారు.

రుణాలకు, రుణమాఫీకి దూరం

అధికారులు చేసిన తప్పిదానికి ఐదేండ్లుగా అన్నదాతలు రైతుబంధు, రైతు బీమా వంటి స్కీమ్స్ కు దూరమయ్యారు. రుణాలనూ పొందలేకపోతున్నారు. పాత పాస్ బుక్కుల మీద లోన్లు ఉన్నా... రుణమాఫీకి సైతం దూరమవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని ఉత్తర్వులిచ్చినా అధికారులు కావాలనే పెండింగులోనే పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


Similar News