Damodar Raja Narasimha : ఈ నెల 16 లేదా 17న మాదిగల సమ్మేళనం: మంత్రి రాజనర్సింహ
సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి రాజనర్సింహా పాల్గొని మాట్లాడారు. వర్గీకరణపై సుప్రీంకోర్టుది చారిత్రాత్మక తీర్పు అని అన్నారు. తెలంగాణలో సుప్రీం తీర్పు అమలు చేస్తాం అని సీఎం ప్రకటన చేశారని ఈ సందర్భంగా మాదిగ జాతి ముఖ్యమంత్రికి రుణపడి ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వర్గీకరణ వ్యవహారంలో సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్‌ని రేవంత్ రెడ్డి పెట్టించారని, మాదిగలకు న్యాయం జరగాలని సూచించారని తెలిపారు. మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదు.. అందరం సమానమే అని వెల్లడించారు. వర్గీకరణపై కమిటీ వేసి ఆర్డినెన్స్ తేవాలని సీఎంని కోరతామని మంత్రి రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 16 లేదా 17న మాదిగల సమ్మేళనం నిర్వహిస్తామని, ఈ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తారని వెల్లడించారు.