రూ.65 కోట్ల స్కూల్ ఫీజులు విద్యార్థులకు రిటర్న్ ఇచ్చేయండి.. సర్కార్ ఝలక్

అక్రమంగా ఫీజులు వసూలు చేసిన పాఠశాలలకు మధ్యప్రదేశ్ సర్కార్ ఝలక్ ఇచ్చింది.

Update: 2024-07-11 12:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో విద్యా రోజురోజుకు ఖరీదుగా మారుతోంది. పెరుగుతున్న ఫీజులతో సామాన్యులు సతమతం అవుతున్నారు. పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనుకునే తల్లిదండ్రుల బలహీనతను తమ వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకుంటూ పేట్రేగిపోతున్న విద్యాసంస్థలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజా ఝలక్ ఇచ్చింది. విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ. 64.58 కోట్ల మేర ఫీజులు తిరిగి వారికి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జబల్ పుర్ లోని పలు ప్రైవేటు స్కూల్స్ రూల్స్ కు విరుద్ధంగా ఫీజులను పెంచుకుని విద్యార్థుల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు ఈ అంశంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆరోపణలు వచ్చిన స్కూళ్ల ఖాతాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

2018-20219 నుంచి 2024-2025 మధ్యకాలంలో 10 పాఠశాలలు 81 వేలకు పైగా విద్యార్థుల వద్ద నుంచి రూ.64.58 కోట్ల మేర ఫీజులను అక్రమంగా వసూలు చేసినట్లు కమిటీ గుర్తించింది. దీంతో ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి విద్యార్థులకు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అయితే స్కూల్ ఫీజులో 10 శాతం కంటే ఎక్కువ పెంచుకోవాలనుకుంటే నిబంధల ప్రకారం జిల్లా యంత్రాంగం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. 15 శాతం కంటే మించి ఫీజు పెంచుకోవాలని భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసిన కమిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ పాఠశాలలు మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విద్యార్థుల ఫీజులను అక్రమంగా పెంచుకుని వసూళ్లకు పాల్పడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ స్కూళ్ల ఫీజులపై అధికారులు దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిందండ్రులు కోరుతున్నారు.

Tags:    

Similar News