సెస్, సర్‌ చార్జీలతో రాష్ట్రాలకు నష్టం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో వసూలు చేసే ఆదాయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే వాడుకుంటున్నదని, దీని ద్వారా రాష్ట్రాలకు దక్కడం

Update: 2024-06-22 16:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో వసూలు చేసే ఆదాయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే వాడుకుంటున్నదని, దీని ద్వారా రాష్ట్రాలకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కేంద్రానికి సమకూరుతున్న మొత్తం రెవెన్యూలో వీటి వాటా 10 శాతం దాటకుండా నిబంధన విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు ఆదాయ వనరులు పడిపోతున్నాయని, స్వయం సమృద్ధి కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. సర్‌చార్జీలు, సెస్‌లలో రాష్ట్రాలకు వాటా ఇచ్చే వెసులుబాటు లేనందువల్ల ఆ మేరకు నష్టం జరుగతున్నదని పేర్కొన్నారు. ఇంకోవైపు రాష్ట్రాలు రిజర్వు బ్యాంకు ద్వారా ఒక ఆర్థిక సంవత్సరానికి తీసుకునే రుణాల పరిమితిని కేంద్ర బడ్జెట్ సమయంలోనే స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇలా ముందే ఫిక్స్ చేయడం ద్వారా రాష్ట్రాలు వాటి అభివృద్ధి ప్రణాళికలకు ప్లాన్ చేసుకోవడం వీలవుతుందని సూచించారు.

కేంద్ర బడ్జెట్ రూపకల్పనకు ముందు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగే సన్నాహక సమావేశానికి శనివారం హాజరైన సందర్భంగా డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. రాష్ట్రాల నుంచి వసూలవుతున్న పన్నుల్లో డివొల్యూషన్ పేరుతో తిరిగి రాష్ట్రాలకు ఇచ్చే వాటా విషయంలో ముందుగానే చెప్తున్నట్లుగా రుణాలకు సంబంధించి కూడా ఇదే విధానాన్ని అవలంబించడం ఉత్తమంగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో కాస్త వెసులుబాటు ఉండాలని సూచించిన డిప్యూటీ సీఎం.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు చేయాలని, ఆ ఫార్ములాపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్ర పథకాలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం నుంచి 4.60 లక్షల కోట్లు విడుదలైతే అందులో తెలంగాణకు రూ.6,577 కోట్లు మాత్రమే వచ్చిందని, ఇది 1.4% మాత్రమేనని వివరించారు.

దేశవ్యాప్తంగా నిరుద్యోగం, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయని, అభివృద్ధికి ఈ రెండూ ప్రధాన సవాళ్ళుగా మారాయని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. వీటిపై దృష్టి పెట్టి తగిన విధాన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు. ఆదాయ పంపిణీలో అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నందున కేంద్ర బడ్జెట్ దీనిపై ఫోకస్ పెట్టాలన్నారు. నిరుద్యోగం పెరుగుతున్నందున తగిన ఉపాధి అవకాశాలు లభించేలా స్కిల్ ట్రెయినింగ్ కీలకంగా మారిందని, అందువల్లనే తెలంగాణ ప్రభుత్వం ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్)లను అడ్వాన్సుడ్ ట్రెయినింగ్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నదని గుర్తుచేశారు. ఇది సానుకూల ఫలితాలను ఇస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ఈ ప్రణాళికకు ప్రత్యేక సాయం పేరుతో నిధులను రాష్ట్రానికి ఇవ్వాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని, దీనికి కేంద్ర బడ్జెట్‌లో పరిష్కారం కనిపించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఒక్కో వెనకబడిన జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున తొమ్మిది జిల్లాలకు రూ.450 కోట్లు రావాల్సి ఉన్నదని, మూడేండ్లుగా కేంద్రం నుంచి విడుదల కాలేదని, వెంటనే రూ. 2,250 కోట్లను రిలీజ్ చేయాలని నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క సూచించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర సంక్షేమ పథకాల కింద తెలంగాణకు రావాల్సిన రూ. 495 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిపోయాయని, వీటిని సెటిల్ చేస్తామంటూ గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ హామీ ఇచ్చినా ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయిందని, వెంటనే దీన్ని ఫైనల్ చేయాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలకు వాడుకునే వెసులుబాటు ఉండాలని, ఈ రెండూ సంపద సృష్టి, అభివృద్ధికే దోహదపడుతున్నాయని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మూసి నది అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ యాక్టివిటీస్‌ను ముమ్మరం చేసినందున దీనికి అవసరమైన నిధులను స్పెషల్ అసిస్టెన్స్‌గా భావించి కేంద్రం ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఆవిష్కృతమవుతున్నందున కేంద్రం నుంచి కూడా ఇతోధిక సాయం అందాలన్నారు. రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై పాత్రికేయులు అడిగిన సందేహాలకు డిప్యూటీ సీఎం బదులిస్తూ, రాష్ట్ర ప్రభుత్వమే అంతర్గతంగా వనరులను సమీకరించుకుంటున్నదన్నారు. హామీ ఇచ్చిన ప్రకారం రుణమాఫీ షెడ్యూల్ టైమ్‌కే అమలవుతుందన్నారు.

బొగ్గు గనులు, బ్లాకుల వేలాన్ని ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని, వారి ప్రభుత్వ హయాంలోనే రెండు బ్లాకులు ప్రైవేటుపరం అయ్యాయని, కేంద్రం ఈ చట్టాన్ని తీసుకురావడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలే సంపూర్ణ మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనకూడదని అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో సత్తుపల్లి, కొయ్యలగూడెం బ్లాకులు ప్రైవేటు సంస్థకు దక్కాయన్నారు. సింగరేణికి నష్టం జరిగేలా, సన్నిహతంగా ఉండే రెండు ప్రైవేటు కంపెనీలకు మేలు జరిగేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు.


Similar News