సెప్టెంబర్‌లోనే లోక్‌సభ రద్దు..? కేంద్రం వ్యూహమిదేనా..!

పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలను సెప్టెంబరు 18-22 తేదీల మధ్యలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

Update: 2023-08-31 10:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలను సెప్టెంబరు 18-22 తేదీల మధ్యలో ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జీ-20 సమావేశాలు ముగిసిన తర్వాత పార్లమెంట్ స్పెషల్ సెషన్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకోవడం వెనక భారీ ప్లాన్ ఉన్నట్లు ఢిల్లీలోని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్లమెంటును రద్దు చేసి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయా?.. లేక యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదం కోసం చర్చ జరగనున్నదా?.. లేక ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్సు యాక్టుల స్థానంలో తీసుకొచ్చిన మూడు బిల్లులను పాస్ చేసే ఆలోచన ఉన్నదా?.. ఇలాంటి అనేక ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి.

ప్రత్యేక సెషన్‌లో పదేళ్ళ పాలనలోని ప్రగతిని యావత్తు దేశానికి వినిపించేందుకు వాడుకుని చివరి రోజున కేంద్ర క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి లోక్‌సభను రద్దు చేసే నిర్ణయం తీసుకునే అవకాశాలపైనా చర్చలు జరుగుతున్నాయి. హఠాత్తుగా స్పెషల్ సెషన్ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వెనక ఉద్దేశం ఏమై ఉంటుందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. డిసెంబరులో షెడ్యూలు ప్రకారం జరగనున్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ (మిజోరాం కూడా) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కే పరిస్థితులు లేవనే అంచనాకు వచ్చి ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడకుండా ముందస్తుకు వెళ్ళే ఆలోచనతోనే ఈ సెషన్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నికలకు వెళ్ళడానికి ముందే సివిల్ కోడ్ బిల్లుతో పాటు మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు కూడా ఆమోదం పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబరులో లోక్‌సభను రద్దు చేయడం ద్వారా నవంబరు చివర్లో లేదా డిసెంబరులో జరిగే సార్వత్రిక ఎన్నికలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా టీమ్ సన్నాహకాల్లోకి కూడా వెళ్ళకముందే ఉక్కిరిబిక్కిరి చేయవచ్చనే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ముందస్తు ఎన్నికల అవకాశాలపై రెండు రోజుల క్రితమే మమతా బెనర్జీ, నితీష్ కుమార్ లాంటి కొద్దిమంది అనుమానాలను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత మార్పులకు మూడు నెలల ముందు శ్రీకారం చుట్టడం వెనక ముందస్తు ఉద్దేశం ఉండొచ్చన్న సందేహాలకు ఇప్పుడు ప్రత్యేక సెషన్ ప్రకటనతో బలం చేకూరినట్లయింది.

Tags:    

Similar News