తెలుగులో రుణమాఫీ మార్గదర్శకాలు.. వెంకయ్యనాయుడు స్పెషల్ ట్వీట్

తెలంగాణ సర్కారు రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలుగులో జారీ చేయడం పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Update: 2024-07-17 13:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కారు రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలుగులో జారీ చేయడం పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని తాను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు.

ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని తాను ఎప్పటినుంచో చెబుతున్నానన్నారు. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావుకి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.


Similar News