ఆరంభ శూరత్వం! ప్రకటనలకే పరిమితం.. అమలుకు నో ప్రియారిటీ
తెలంగాణ ఏర్పడిన తర్వాత సాహిత్య, సాంస్కృతిక అభివృద్ధి మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి తరహాలో ఉండిపోయింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సాహిత్య, సాంస్కృతిక అభివృద్ధి కోసం కృషి మొదలైనా.. అది మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి తరహాలో ఉండిపోయింది. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోకుండా పోయాయి. రాష్ట్ర అధికార భాష తెలుగును ప్రభుత్వ వ్యవహారాల్లో అమలు చేస్తామని ప్రపంచ తెలుగు మహాసభల మొదలు అనేక సందర్భాల్లో ఆర్భాటంగా ప్రకటనలు చేసినా.. అది మాటలకే పరిమితమయ్యాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ భాషకు, యాసకు ఒక మేరకు గుర్తింపు లభించిందనేది నిర్వివాదాంశం. ఒకప్పుడు విలన్లు, జోకర్లు మాట్లాడుకోడానికే తెలంగాణ భాష పరిమితమైంది. కానీ ఇప్పుడు ఆ యాస కేంద్రంగానే సినిమాలు రావడం విశేషం. సమైక్య రాష్ట్రంలో ఆదరణకు నోచుకోని పలు జానపద కళారూపాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీవం పోసుకున్నాయి.
- దిశ, తెలంగాణ బ్యూరో
మరిచిన హామీలు
కేసీఆర్ తరచూ “ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై..” అంటూ ఏనుగు లక్ష్మణ కవి రచించిన పద్యాన్ని గుర్తుచేస్తూ ఉంటారు. తుదకంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం.. వారే ఉత్తములవుతారు.. అంటూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ తెలుగు భాషపై ఆయన ఇచ్చిన హామీల అమలులో మాత్రం పై వాక్యాలను గుర్తుచేసుకోవడం లేదు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో, ఆ తర్వాత 2018లో పలు వాగ్దానాలు చేశారు.
అందులో కొన్ని మాత్రమే కార్యరూపం దాల్చాయి. మిగిలినవి ఆచరణకు ఆమడదూరంలోనే ఉండిపోయాయి. తొమ్మిదేండ్ల ప్రస్థానం ముగిసి పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 21 రోజుల దశాబ్ది ఉత్సవాల్లో సాహిత్య దినోత్సవం పేరుతో జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనం, సాహిత్య రచన లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
కొనసాగుతూ ఉన్న కాళోజీ కళాక్షేత్రం
వరంగల్ నగరం నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణ రావు పేరిట కళాక్షేత్రాన్ని నిర్మించాలని భావించింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల్లోనే కాళోజీ శతజయంతి సందర్భంగా 2014 సెప్టెంబరు 9న బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్స్ లో కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 73 కోట్లతో నిర్మించాలనుకున్న ఈ భవనానికి నిర్మాణపు పనులు మొదలయ్యాయి.
నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలోనాలుగు అంతస్తుల్లో 1500 మంది కూర్చునే కన్వెన్షన్ సెంటర్ పనులను ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ఇటీవల సందర్శించి రాష్ట్ర అవతరణ దినోత్సవం లోగా పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. సీఎం శంకుస్థాపన చేసి తొమ్మిదేండ్లు అవుతున్నా ఇంకా వినియోగంలోకి రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులను మళ్లించినందునే భవనం ఆలస్యమైందంటూ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ రెండేండ్ల క్రితం వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలుగులో ఉత్తరప్రత్యుత్తరాల్లేవ్
అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు (జీవోలు) తెలుగులోనే జరుగుతాయంటూ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2017 డిసెంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దుకాణాల నేమ్ బోర్డుల్లో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తామని కూడా ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం తెలుగులోనే చేయాలని సర్క్యులర్ జారీ అయింది. ఇవేవీ అమల్లోకి రాలేదు. ఇప్పటికీ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు ఇంగ్లీషులోనే వెలువడుతున్నాయి. మంత్రివర్గ సమావేశాల్లోనూ నోట్ ఫైల్స్, ప్రతిపాదనలు ఇంగ్లీషులోనే ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సర్క్యులర్ రూపంలో జారీ అయ్యే ఆదేశాలు సైతం ఆంగ్లంలోనే ఉంటున్నాయి.
నిఘంటువుల తయారీ నత్తనడకన
రాష్ట్రంలో ప్రజలు వాడుతున్న భాష, యాస, మాండలికం తదితరాలన్నింటినీ రికార్డు చేయనున్నట్లు కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. నిఘంటువులను రూపొందించడానికి భాషా శాస్త్రవేత్తలకు బాధ్యతలు అప్పజెప్తామన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన యాస ఉన్నందున జిల్లాలవారీగానే పదకోశాల ప్రచురణలు ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ఇది నామమత్రంగా మొదలైనా ఆ తర్వాత పక్కకుపోయింది. ఇక లైబ్రరీల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉన్నది. గ్రంథాలయాలకు నిధుల కేటాయింపు, కొత్త పుస్తకాలను సమీకరించుకోవడం కాగితాలకే పరిమితమైంది.
తెలుగు పాఠ్యాంశ బోధన.. విఫలం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పదో తరగతి వరకు తెలుగు పాఠ్యాంశం (సబ్జెక్టు) తప్పనిసరిగా ఉండాలని 2017 సెప్టెంబర్‌లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో ‘తప్పనిసరి తమిళం’ నిబంధనపై అధ్యయనం చేసి వచ్చిన బృందంతో సమావేశమైన సందర్భంగా పై ప్రకటన చేశారు. ఏ మీడియంలో చదవుకుంటున్నా తెలుగు సబ్జెక్టు మాత్రం తప్పనిసరిగా అభ్యసించాల్సిందేనని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో తెలుగు పండిట్ ఉండాలని నొక్కిచెప్పారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కానీ ఆంగ్ల మాధ్యమం పాఠశాలల దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తెలుగు బోధన అటకెక్కింది.
ఊసేలేని రాచకొండ ఫిలిం సిటీ
ఉమ్మడి నల్లగొండ జిల్లా రాచకొండ గుట్టల ప్రాంతంలో సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫిలిం సిటీ నిర్మాణం కానున్నట్లు సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారం పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి 2014 డిసెంబర్ 15న ఏరియల్ సర్వే నిర్వహించారు. మొత్తం 32 వేల ఎకరాల్లో ఫిలిం సిటీ కోసం 2 వేల ఎకరాలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
డిస్నీ లాంటి పలు అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణవైపు చూస్తున్నాయన్నారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలిపోతుందేమోననే వార్తలు వస్తున్న సమయంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దాదాపు మూడు గంటల పాటు రాచకొండ పరిసరాల్లో గడిపిన కేసీఆర్.. జిల్లా కలెక్టరుతోనూ సమీక్షించారు. శంషాబాద్ విమానాశ్రయానికి కూడా దగ్గరగా ఉంటున్నందున సినీ పరిశ్రమకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రగతి భవన్‌లో చిరంజీవి, నాగార్జున తదితరులతో కేసీఆర్ చర్చలు కూడా జరిపారు. కానీ ఇప్పటివరకు అది వర్కవుట్ కాలేదు.
పుణె తరహాలో ఫిలిం ఇన్‌స్టిట్యూట్
రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, పుణెలోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్ తరహాలో తెలంగాణలోనూ నెలకొల్పుతామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ 2020 ఫిబ్రవరి 10న హామీ ఇచ్చారు. సినీ నటులు అక్కినేని నాగార్జున, చిరంజీవి తదితరులతో సమావేశమై అంతర్జాతీయ ప్రమాణాలతో శంషాబాద్ పరిసరాల్లో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అనువైన స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సినీ, బుల్లితెర కార్మికులకు నివాస వసతి కోసం చిత్రపురి కాలనీ తరహాలో పది ఎకరాల స్థలాన్ని శంషాబాద్ సమీపంలో ఇస్తామని నొక్కిచెప్పారు. సినీ కార్మికులకు ఇన్సూరెన్స్ విషయంలోనూ హామీ నెరవేరలేదు.
సాంస్కృతిక ఆడిటోరియంలెక్కడ?
తెలంగాణ ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సాహిత్య అకాడమీ, సంగీత-నాటక అకాడమీ, అధికార భాషా సంఘం, సాంస్కృతిక సారధి తదితర వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. అయితే, ప్రతి జిల్లాలో ఒక బహుళార్థక సాంస్కృతిక కేంద్రాన్ని నెలకొల్పుతామని, ప్రతీ డివిజన్ కేంద్రంలోసాంస్కృతిక ఆడిటోరియంలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇవేవీ అమల్లోకి రాలేదు.
మరోవైపు తెలుగు మహాసభల నిర్వహణతో పాటు తెలంగాణ భాష, యాసలో డాక్యుమెంటరీలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించింది. జానపద కళారూపాలకు ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు దక్కింది. కొమురంభీమ్, సురవరం ప్రతాపరెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్, సర్వాయి పాపన్నగౌడ్ లాంటి కొద్దిమంది సాహితీవేత్తల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. దాశరథి, కాళోజీ పేరిట ప్రతిష్ఠాత్మక అవార్డులను నెలకొల్పి ప్రతి ఏటా రూ.1,01,116/- నగదుతో పాటు సాహితీ పురస్కారాలను అందిస్తున్నది.
జానపద నృత్యాలకు గుర్తింపు
ఒగ్గుడోలు, కొమ్ముకోయ, గుస్సాడి, కోలాటం, చిందు యక్షగానం, శారదకాండ్రు, బైండ్లవారు, కొయ్యబొమ్మలు, హరికథ, బుర్రకథ లాంటి పలు జానపద, గిరిజన కళారూపాలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రోత్సాహం, ప్రాధాన్యత లభించింది. కాకతీయుల కాలం నాటి 'పేరిణి' శాస్త్రీయ నృత్యం ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో ఒక కోర్సుగా చేరింది.
సమ్మక్క-సారలమ్మ, ఏడుపాయల, నాగోబా లాంటి గిరిజన జాతరలతో పాటు కొమురవెల్లి, అయినవోలు, కొరివి వీరభద్రస్వామి జాతర, లింగమంతుల స్వామి పెద్ద గట్టు జాతర, మన్యంకొండ బ్రహ్మోత్సవాలు తదితరాలకు ప్రభుత్వం నుంచి ప్రాధాన్యత లభిస్తున్నది. భాషా సాంస్కృతిక శాఖ తరఫున తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు, వారసత్వం తదితర అంశాలపై దాదాపు 45 పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి.
బతుకమ్మ, బోనాలకు ప్రాచుర్యం
బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. ఇతర రాష్ట్రాల్లోనూ గుర్తింపు లభించింది. హర్యానాలోని సూరజ్‌కుండ్, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఎగ్జిబిషన్ సందర్భంగా పలు రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి అవగాహన కలిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌పథ్ (కర్తవ్యపథ్)పై ఈ రెండింటినీ ప్రదర్శించడానికి అవకాశం లభించింది.
తెలంగాణ యాస హిట్ ఫార్ములా
సమైక్య రాష్ట్రంలో దీర్ఘకాలంపాటు తెలంగాణ భాష, యాస విలన్లు, జోకర్లు మాట్లాడుకునేదిగా మాత్రమే ఉండేది. స్వరాష్ట్రంలో అది ఒక హిట్ ఫార్ములాగా మారింది. ఫిదా, లవ్‌స్టోరీ, జాతిరత్నాలు, భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్, మేము ఫేమస్, విరాటపర్వం, బలగం.. డీజే టిల్లు, పరేషాన్ ఇలా పదుల సంఖ్యలో సినిమాల్లో తెలంగాణ యాస, మాండలికం సక్సెస్ మంత్రగా మారింది. హీరో, హీరోయిన్‌లు సైతం తెలంగాణ యాసలో మాట్లాడుకోవడం మొదలైంది. సినిమా హిట్ కావడానికి తెలంగాణ యాస, భాష కీలకంగా మారింది.