Wayanad : కేరళ వయనాడ్ బాధితులను ఆదుకుందాం: సీపీఐ విరాళాల సేకరణ
కేరళ రాష్ట్రం వయనాడ్ వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీపీఐ పార్టీ విరాళాల సేకరణ చేపట్టింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ రాష్ట్రం వయనాడ్ వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీపీఐ పార్టీ విరాళాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని అబిడ్స్, కోఠి, గన్ ఫౌండ్రి, బషీర్ బాగ్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పార్టీ నాయకులు విరాళాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. వరదలు, కొండచరియలు కనికరం లేకుండా వందలాది మంది ప్రాణాలను బలికొన్నాయని, ఇది హృదయ విదారకమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. కనికరంలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న వయనాడ్ ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకోవడం మన సమిష్టి బాధ్యత అని పిలుపునిచ్చారు.
పశ్చిమ కనుమల వెంట విస్తరించి ఉన్న పచ్చని పర్వత ప్రాంతమైన వయనాడ్, కేరళను సందర్శించే ప్రజలకు ప్రధాన పర్యాటక కేంద్రం అని తెలిపారు. కొబ్బరి, తాటి చెట్లు, దట్టమైన అడవులు, వరి పొలాలు, ఎత్తైన శిఖరాలు గొప్ప ప్రకృతి దృశ్యాలతో అలంకరించి ఉంటాయని తెలిపారు. వీటిని రంక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హైదరాబాద్ ప్రజల సహాయం వయనాడ్ ప్రజలకు, గాయపడిన వందలాది మంది బాధితులకు తక్షణ సహాయాన్ని పొందడంలో సహాయపడుతుందని, తెలిపారు. మానవతా ప్రతిస్పందనతో కేరళ రాష్ట్ర సీపీఐ శ్రేణులు రెస్క్యూ ఆపరేషన్ టీమ్‌లలో భాగస్వాములై వయనాడ్ కొండచరియలు విరిగిపడిన బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నారని చెప్పారు. ప్రకృతి విపత్తుతో నిర్వాసితులుగా మారి, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవడం దేశ ప్రజల బాధ్యత అని, వారికి తక్షణ సహాయం, పునరావాసం అందించడానికి ప్రజలు విరాళాలు అందజేయాలని నారాయణ కోరారు.